AP Elections 2024: ఏపీలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పిన అమిత్ షా

www.mannamweb.com


Amit shah prediction on AP Election Results: 2024 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందనే దానిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. ఏపీ ఎన్నికల కౌటింగ్ జూన్ నాలుగో తేదీ జరగనుండగా.. ఫలితాలపై రాజకీయ విశ్లేషకులు, లీడర్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వస్తుందని కొంతమంది చెప్తుంటే.. ఎన్డీయే కూటమిదే అధికారమని మరికొంతమంది వ్యూహకర్తలు అభిప్రాయపడుతున్నారు. ఇక వైసీపీ నేతలు అయితే ఏకంగా సంబరాలకు సిద్ధం కండి అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్లు పెడుతున్నారు. జూన్ 9వ తేదీ ఉదయం 9 గంటల 38 నిమిషాలకు విశాఖలో జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారంటూ వైసీపీ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ కూడా చేసింది.

ఈ క్రమంలోనే ఏపీ ఎన్నికలపై బీజేపీ అగ్రనేత, హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై అమిత్ షా తన అంచనాను వెల్లడించారు. పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్యూలో అమిత్ షా ఏపీ ఎన్నికల గురించి ప్రస్తావించారు. లోక్‌సభ ఎన్నికలతో పాటుగా మూడు రాష్ట్రాలకు జరుగుతున్న శాసనసభ ఎన్నికల్లోనూ బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటుచేస్తుందని అమిత్ షా చెప్పారు. ఒడిశాలో అధికారాన్ని కైవసం చేసుకుంటామని.. అలాగే టీడీపీ, జనసేనతో కలిసి ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు. ఇక అరుణాచల్ ప్రదేశ్‌లోనూ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల విషయానికి వస్తే ఏపీలో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 17 ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉందని అమిత్ షా జోస్యం చెప్పారు. ఏపీలో మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉండగా.. టీడీపీ 17, బీజేపీ 6, జనసేన 2 చోట్లా పోటీచేసింది. అయితే 25 స్థానాలకు గానూ ఎన్డీయే కూటమికి 17 ఎంపీ సీట్లు రావచ్చని అమిత్ షా అంచనా వేశారు. అలాగే బెంగాల్‌లోని 42 స్థానాల్లో బీజేపీ 24 నుంచి 30 ఎంపీ సీట్లు కైవసం చేసుకుంటుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.

మరోవైపు ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం సాధిస్తుందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో పాటు రాజకీయ విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్ సైతం జోస్యం చెప్పారు. ఏపీలో కూటమికి 15 ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉందని యోగేంద్ర యాదవ్ ఇటీవల వ్యాఖ్యానించారు. తాజాగా అమిత్ షా సైతం 17 చోట్ల గెలుస్తామని చెప్పడంతో.. తెలుగు తమ్ముళ్లల్లో జోష్ నెలకొంది. మరి ఎవరి అంచనాలు ఎంతమేరకు నిజమవుతాయనేదీ జూన్ నాలుగో తేదీన వెల్లడయ్యే ఫలితాల్లో తేలనుంది.