అమరావతి: ఏపీలో ఎన్నికలు (AP Elections 2024) జరుగుతున్న దృష్ట్యా ఎన్నికల సంఘం (Election Commission) పలు నిబంధనలను విధించిన విషయం తెలిసిందే. పలుమార్లు ఎన్నికల నియమాలను అధికార వైసీపీ తుంగలో తొక్కుతోంది. అయితే ఈ విషయం ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా దృష్టికి రావడంతో ఆయన జగన్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీ సీఈఓ మీనా గురువారం మీడియా సమావేశంలో పలు కీలక విషయాలను పంచుకున్నారు. ప్రభుత్వ సింబల్‌ను కొన్ని ప్రకటనల్లో వాడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈసీ పర్మిషన్ కోసం వచ్చినప్పుడు బ్లర్ చేసే చూపారని చెప్పారు. ఆ తర్వాత ప్రభుత్వ సింబల్ ఉన్న ప్రకటలను తొలగించాలని సూచించామని తెలిపారు.
పోలింగ్ ఏర్పాట్లపై సీఈఓ మీనా ఏమన్నారంటే…
ఏపీ ఎన్నికల్లో మొత్తంగా 4.14 కోట్ల మంది ఓటు హక్కు వివియోగించుకోనున్నారని సీఈఓ మీనా తెలిపారు. ఫైనల్ ఎస్ఎస్ఆర్ కంటే తుది ఓటర్ల జాబితాలో 5.94 లక్షల మంది ఓటర్లు పెరిగారని తెలిపారు. ఏపీలో మొత్తం 46,389 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని వివరించారు. ఇప్పటి వరకు రూ. 203 కోట్లు సీజ్ చేశామన్నారు. నగదుతో సహా మద్యం, గంజాయి, విలువైన ఆభరణాలను సీజ్ చేశామని చెప్పారు.
14 సెగ్మెంట్లల్లో 100 శాతం వెబ్ కాస్టింగ్ పెడుతున్నామన్నారు. అలాగే ఈ 14 సెగ్మెంట్లల్లో భద్రత కూడా పెంచుతామని చెప్పుకొచ్చారు. ఓటర్లకు ఎండతో ఇబ్బంది లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు. హోం ఓటింగ్ కోసం కేవలం 28,591 మంది మాత్రమే ఎంచుకున్నారని వివరించారు. మొత్తంగా 7,28,484 మంది హోం ఓటర్లు ఉంటే.. కేవలం 3 శాతం మాత్రమే హోం ఓటింగ్ కోరుకున్నారని తెలిపారు.
హోం ఓటింగ్ ప్రక్రియ ఈరోజు(గురువారం) నుంచే ప్రారంభమైంది.. ఈ నెల 8వ తేదీతో పూర్తి అవుతుందని చెప్పారు. 8 తేదీ లోగానే పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. కోర్టు ఆదేశాల మేరకు గాజు గ్లాస్ గుర్తును మొత్తంగా 15 చోట్ల మార్చినట్లు తెలిపారు. ఆ 15 స్థానాల్లో స్వతంత్రులకు వేరే గుర్తులు కేటాయించినట్లు వివరించారు. విశాఖలో పార్లమెంట్ పరిధిలో మూడు బ్యాలెట్ యూనిట్లు అవసరం అవుతున్నాయని చెప్పారు.
మంగళగిరి, తిరుపతి సెగ్మెంట్లల్లో మూడు బ్యాలెట్ యూనిట్లు అవసరమని చెప్పారు. 15 వేల బ్యాలెట్ యూనిట్లను అదనంగా తెప్పించినట్లు తెలిపారు. పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను పోలీస్ అధికారులకు పంపించినట్లు తెలిపారు. ఎవరికైనా భద్రత కల్పించాల్సిన అవసరం ఉంటే సెక్యూరిటీ ఇవ్వాలని సూచించినట్లు చెప్పారు.374 మంది అసెంబ్లీ అభ్యర్థులకు.. 64 మంది పార్లమెంట్ అభ్యర్థులకు భద్రత కల్పించాలని పోలీస్ అబ్జర్వర్‌లు సూచించారని అన్నారు.
ఈ ఎన్నికల్లో 1.60 లక్షల బ్యాలెట్ యూనిట్లను వాడుతున్నామన్నారు. మొత్తం పోస్టల్ బ్యాలెట్లు ఎంత మేరకు వచ్చాయనేది ఇంకా ఫైనల్ కాలేదన్నారు. ఎన్నికల విధుల్లో 3.30 లక్షల మంది ఉన్నారని తెలిపారు. గోవా, హర్యానా, యానాం, తెలంగాణ నుంచి లిక్కర్ వస్తోందన్నారు.
గోవా, హర్యానా డీజీపీలతో తాము మాట్లాడామన్నారు. లిక్కర్ డంప్ , సరఫరా వెనుక ఒకరిద్దరికీ ఈ కేసుతో సంబంధముందని తెలిసిందన్నారు. ప్రతి జిల్లాలో ఎఫ్ఎస్టీ టీంలు నిఘా ఉన్నాయని తెలిపారు. మద్యం అక్రమాలను అరికడుతున్నామని ఏపీ సీఈఓ మీనా పేర్కొన్నారు.