AP Election 2024: ఎన్నికల వేళ ఏపీలోని పలు జిల్లాల్లో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ప్రధాన పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తి.. కొట్లాటలకు దిగుతున్నారు. ఓటేసేందుకు క్యూ లైన్‌లో రావాలని చెప్పినందుకు.. ఓ ఓటరుపై తెనాలి వైసీపీ అభ్యర్థి శివకుమార్ చేయి చేసుకున్నారు. ఈ ఘటన పల్నాడు జిల్లా తెనాలిలో చోటు చేసుకుంది. ఓటు వేసేందుకు క్యూలైన్‌లో కాకుండా శివకుమార్ నేరుగా వెళ్తుండటంపై ఓటరు అభ్యంతరం తెలిపాడు. దీంతో ఆగ్రహించిన శివకుమార్ అతడిపై దాడి చేశారు. సహనం కోల్పోయిన ఓటరు కూడా అతడి చెంప చెళ్లుమనిపించాడు. ఈ క్రమంలో ఘర్షణ చోటు చేసుకుంది. శివకుమార్ అనుచరులు ఓటరుపై విచక్షణారహితంగా దాడి చేశారు.
కాగా, ఓటరుపై ఎమ్మెల్యే శివ కుమార్ దాడి చేసిన ఘటనపై ఎలక్షన్ కమిషన్, పోలీసులు స్పందించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరించి తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇక, ఈ దాడిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Ysrcp: తెనాలి వైకాపా అభ్యర్థిని అదుపులోకి తీసుకోండి.. పోలీసులకు ఈసీ ఆదేశం
గుంటూరు: తెనాలి వైకాపా అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్‌పై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఆయన్ను అదుపులోకి తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. పోలింగ్ పూర్తయ్యే వరకు శివకుమార్‌ను గృహనిర్బంధంలోనే ఉంచాలని పేర్కొంది. ఈసీ ఎందుకు చర్యలు తీసుకుందంటే..
పోలింగ్ కేంద్రంలో శివకుమార్ క్యూలైన్‌లో వెళ్లకుండా నేరుగా వెళ్లడంపై ఓటరు అభ్యంతరం చెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన శివకుమార్.. ఓటరు చెంపపై కొట్టారు. వెంటనే ప్రతిఘటించిన ఓటరు.. వైకాపా అభ్యర్థి చెంప చెళ్లుమనిపించారు. అనంతరం శివకుమార్ అనుచరులు ఓటరుపై విచక్షణారహితంగా దాడికి దిగారు. ఈ ఘటన ఎన్నికల సంఘం దృష్టికి వెళ్లడంతో చర్యలు తీసుకుంది.