AP Elections: ఏపీ ఎన్నికల్లో అదే గేమ్ ఛేంజర్ కానుందా ? మ్యానిఫెస్టోలు, అజెండాలు ఎటో..!

www.mannamweb.com


ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకూ వైసీపీ తరచూ చెప్పుకుంటున్న సంక్షేమమో లేక విపక్షాలు చెప్పుకుంటున్న అభివృద్ధో ఎన్నికల అజెండా అవుతుందని అంతా భావించారు. చివరికి వీటి కంటే మ్యానిఫెస్టోలో కీలకమవుతాయని కూడా అనుకున్నారు. కానీ ఇప్పుడు వీటన్నింటినీ మించి మరో అంశం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో అధికార విపక్షాలన్న తేడా లేకుండా అంతా దాని చుట్టే తిరుగుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన భూహక్కు చట్టం (ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్) ఈసారి ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు అస్త్రంగా మారుతుందని ఎవరూ ఊహించలేదు. శతకోటి ఎన్నికల అంశాల్లో అదీ ఒకటిగా ఉండొచ్చని మాత్రమే భావించారు. కానీ అప్పటికే రాజకీయ పార్టీలు ప్రచారం చేసుకుంటున్న పథకాలు, అభివృద్ధి వంటి అంశాలు, మ్యానిఫెస్టోల్ని దాటి ఇప్పుడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చర్చలోకి వచ్చేసింది. అది ఎంతగా అంటే ఇప్పుడు జగన్, చంద్రబాబు, పవన్ అందరి నోటా ఇదే మాట.
ఏపీలో వైసీపీ సర్కార్ తెచ్చిన భూహక్కు చట్టం ఇంకా అమల్లోకి అయితే రాలేదు. కానీ అది అమల్లోకి వస్తే ఏం జరుగుతుందన్న దానిపై విపక్షాలు గట్టిగా ఫోకస్ పెట్టాయి. అప్పటికే జనంలో ఉన్న ఆందోళనలను వాడుకుంటూ ఎన్నికల అజెండాగా మార్చేశాయి. ముఖ్యంగా సీఎం జగన్ మళ్లీ గెలిస్తే భూహక్కు చట్టంతో మీ భూములు, స్థలాలు అన్నీ లాక్కుంటాడంటూ జనాన్ని రెచ్చగొట్టేందుకు విపక్షాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అసలే భూముల విలువ తెలిసిన రూరల్ ప్రాంతాల ప్రజలు, అందులోనూ వైసీపీ ఓటర్లలోనే ఇది భయాందోళనలు కలిగిస్తోంది. దీంతో సహజంగానే వైసీపీ ఆత్మరక్షణలో పడిపోయింది. ఓసారి భూహక్కు చట్టం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తెచ్చిందని, మరోసారి దీన్ని ఇప్పట్లో అమలు చేయబోమని, ఇంకోసారి ఈ చట్టంలో తప్పేముందని .. ఇలా రోజుకో రకంగా వైసీపీ మంత్రులు, సలహాదారులు, ఎమ్మెల్యేలు, స్వయంగా సీఎం జగన్ కూడా మాట్లాడుతున్నారు. దీంతో ప్రజల్లో గందరగోళం మరింత పెరుగుతోంది. దీనిపై ఇప్పటికిప్పుడు క్లారిటీ ఇచ్చే పరిస్ధితిలో ప్రభుత్వం కూడా లేదు. ఇది అంతిమంగా ఎన్నికల్లో తమ కొంపముంచుతుందన్న భయాలు వైసీపీలో పెరుగుతున్నాయి.