AP Govt: ఏపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలపై క్లారిటీ ఇచ్చింది.

ఏపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలపై క్లారిటీ ఇచ్చింది. శాసనమండలిలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఛార్జీల పెంపు అంశంపై స్పష్టత ఇచ్చారు.


ఈ క్రమంలో ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు విద్యుత్ ఛార్జీలను పెంచలేదని, భవిష్యత్తులోనూ పెంచబోమని మంత్రి స్పష్టం చేశారు. విద్యుత్ ఛార్జీల బకాయిల పాపం మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిదే. వైసీపీ హయాంలో పెరిగిన రూ.15వేల కోట్ల భారాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై వైకాపా నాయకులు నెడుతున్నారని మంత్రి మండిపడ్డారు.

విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రజలను వైసీపీ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారు. వైసీపీ హయాంలో స్వల్పకాల విద్యుత్ కొనుగోళ్ల పేరుతో సుమారు రూ.10వేల కోట్ల భారాన్ని ప్రజలపై వేశారు. ఒక్క మెగావాట్ విద్యుత్ అధికంగా ఉత్పత్తి చేయలేదు. విద్యుత్ సంస్థల నిధులను దారిమళ్లించారు. పీఎం కుసుమ్ పథకం రాష్ట్రానికి అవసరం లేదంటూ కేంద్రానికి అప్పట్లో వైసీపీ ప్రభుత్వం లేఖ రాయడం తీరని నష్టాన్ని చేసిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఇప్పుడు వీటన్నింటినీ సరిచేసుకుంటూ వస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 65శాతం విద్యుత్ కొనుగోళ్లు తగ్గించాం. కేంద్ర ప్రభుత్వం రాయితీలను కూడా సమర్ధవంతంగా వినియోగించుకుంటూ ముందుకెళ్తున్నాం. రైతులకు పగలే 9గంటల నిరంతర విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు.

మరోవైపు ఎండల తీవ్రత పెరిగింది. ఇదే సమయంలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగే అవకాశం ఉంది. అందుకు తగినట్లుగా విద్యుత్ ఉత్పత్తి ఉండేలా శాఖాధికారులు చర్యలు తీసుకోవానలి మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. వేసవిలో విద్యుత్ వినియోగం, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, ఆర్డీఎస్ఎస్ పనుల పురోగతిపై డిస్కంల సీఎండీలతో మంత్రి సమీక్షించారు.

”వచ్చే వేసవి కాలంలో కూడా రైతులకు 9 గంటల నిరంతరాయ ఉచిత విద్యుత్ ను సరఫరా చేయాలి. గృహ, వ్యాపార, పారిశ్రామిక వినియోగ అవసరాలకు ఇబ్బంది లేకుండా అందరికీ 24 గంటల విద్యుత్ అందించాలి. విద్యుత్ గరిష్ట డిమాండ్ సుమారు 13,700 మెగావాట్లకు చేరుకోవచ్చు.. ఈ వేసవి కాలంలో రోజువారీ విద్యుత్ వినియోగం 260 మిలియన్ యూనిట్లకు చేరుకుంటుందని అంచనాలున్నాయి. ముందస్తు ప్రణాళికలతో విద్యుత్ సరఫరాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలి” అని మంత్రి అధికారులకు సూచించారు.