చికెన్ ప్రియులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్-బర్డ్ ఫ్లూ భయాల వేళ.

ఏపీలో ఇప్పుడు చికెన్ పేరు చెబితేనే జనం భయపడుతున్నారు. గోదావరి జిల్లాల్లో బర్డ్ ఫ్లూ సోకి లక్షలాది కోళ్లు చనిపోతున్న నేపథ్యంలో చికెన్ తినాలంటే ఆలోచిస్తున్నారు. అంతే కాదు కోళ్లను నమ్ముకున్న రైతులు, వాటిని మార్కెట్ చేసే వ్యాపారులు, వీటిని పర్యవేక్షించాల్సిన అధికారులు.. ఇలా అందరినీ బెంబేలెత్తిస్తోంది బర్డ్ ఫ్లూ. ఇలాంటి తరుణంలో తాజాగా గోదావరి జిల్లాల్లో కోళ్లు ఎక్కువగా చనిపోయిన హేచరీల నుంచి శాంపిల్స్ సేకరించిన అధికారులు ల్యాబ్స్ కు పంపారు. వీటి ఫలితాల ఆధారంగా మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు.


రాష్ట్రంలో కోళ్లకు భారీగా బర్డ్ ఫ్లూ సోకిందన్న వార్తల నేపథ్యంలో తాజాగా అధికారులతో సీఎం చంద్రబాబుతో కలిసి పరిస్ధితిని సమీక్షించిన వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు.. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పేశారు. బర్డ్ ఫ్లూ పూర్తిగా తగ్గుముఖం పట్టినట్లు ఆయన తెలిపారు. గోదావరి జిల్లాల్లో భారీగా కోళ్లు చనిపోయినప్పటికీ ప్రస్తుతం పరిస్ధితి అదుపులోకి వచ్చినట్లు ఆయన వెల్లడించారు. బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో దాదాపు 10 కోట్లకు పైగా కోళ్లు ఉంటే అందులో 5.42 లక్షల కోట్లు మాత్రమే చనిపోయినట్లు వ్యవసాయమంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం 40 లక్షల కోళ్లు చనిపోయినట్లు ప్రచారం జరుగుతోందన్నారు. ఈ సమాచారం కరెక్ట్ కాదని మంత్రి వెల్లడించారు. ఇప్పటికే బర్డ్ ఫ్లూ సోకిన కోళ్ల శాంపిల్స్ సేకరించి ల్యాబ్స్ కు పంపడంతో పాటు మిగతా కోళ్లకు వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పూర్తిగా పడిపోయిన చికెన్ అమ్మకాలు తిరిగి పుంజుకునే అవకాశం ఉంది.

మరోవైపు పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు సైతం బర్డ్ ఫ్లూ భయాలు లేకుండా మిగతా ప్రాంతాల వారు హాయిగా చికెన్ తినొచ్చని ప్రకటించారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరుతో పాటు తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు అగ్రహారాల్లో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకిందని భోపాల్ ల్యాబ్ నిర్ధారించిందన్నారు. కాబట్టి ఇక్కడ రెడ్ జోన్లు ఏర్పాటు చేశామన్నారు. ఈ జోన్లలో మినహా మిగిలిన ప్రాంతాల్లో ఉన్న వారు ఉడకబెట్టిన గుడ్లు, మాంసం తీసుకోవచ్చని, ఎలాంటి ఆందోళనలు అవసరం లేదని ప్రకటించారు. బర్డ్ ఫ్లూ ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా హేచరీల నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.