సంక్రాంతి అంటేనే పల్లె పండుగ. పల్లె పండుగ అంటే రైతన్నల పండుగ. అందుకేనేమో పండుగకు ముందుగానే రైతన్నల కోసం కూటమి ప్రభుత్వం వరాలు కురిపిస్తోంది.
తమ ప్రభుత్వం రైతన్నల ప్రభుత్వమని, రైతాంగం సంక్షేమం కోసం వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు పలుమార్లు చాటిచెప్పారు. తాజాగా ప్రభుత్వం రైతన్నల కోసం ఓ కీలక నిర్ణయం కూడా తీసుకుంది.
ఏపీలో ఎన్నికల వేళ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టాన్ని అమల్లోకి తెచ్చే ప్రసక్తే లేదని, రైతన్నలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఎవరి భూమిపై వారి పెత్తనం ఉండేలా చర్యలు ఉంటాయని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు అధికారంలోకి రాగానే, తొలి సంతకం సదరు ఫైలుపై చేసి ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను రద్దు చేశారు. అంతేకాదు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వరదలు వచ్చాయి. పంట చేతికి అందిందన్న ఆనందంలో గల రైతులకు వరదలు శాపాలుగా మారాయి.
ఎలాగైనా రైతాంగాన్ని ఆదుకోవాలని భావించిన ప్రభుత్వం, వరదసాయం ప్రకటించింది. రైతుల ఖాతాల్లో నగదు జమ చేసి, అండగా నిలిచింది ప్రభుత్వం. రైతన్నల సంక్షేమం కోసం పాటుపడుతున్న కూటమి ప్రభుత్వం రానున్న సంక్రాంతిని దృష్టిలో ఉంచుకొని, మరో కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి అంటే రైతులు వారు పండించిన పంటను అమ్ముకొని, తమ ఇంట సంబరంగా జరుపుకొనే పండుగగా చెప్పవచ్చు. అందుకే ధాన్యం పండించిన రైతుల కోసం ప్రభుత్వం వరాలు కురిపించింది.
గతంలో ఎన్నడూ లేనివిధంగా మొదట ధాన్యం అమ్మిన రైతుకు 24 గంటల్లో నగదు జమ చేసేలా ప్రభుత్వం నిర్ణయించింది. కొద్ది రోజులు గడిచాయి. మళ్లీ ఒక ప్రకటన జారీ చేసింది ప్రభుత్వం. కేవలం 2 లేక 3 గంటల్లో డబ్బులు జమయ్యేలా చర్యలు తీసుకుంది ప్రభుత్వం. ఇక రైతన్నల ఆనందం అంతా ఇంతా కాదు. ఎన్నడూ లేని విధంగా తమకు ధాన్యం అమ్మిన 2 గంటల్లో నగదు జమ కావడం ఎన్నడూ ఊహించలేదని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సంక్రాంతికి మరో కానుకను కూడా రైతులకు అందించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏడాది పెట్టుబడి సాయం కింద రైతులకు రూ. 20 వేల వరకు అందించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోందట. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సంబంధిత అధికారులతో చర్చించినట్లు సమాచారం. ఏదిఏమైనా సంక్రాంతికి కానుకగా ధాన్యం అమ్మిన డబ్బులు 2 గంటల్లో జమ చేస్తున్న ప్రభుత్వం, రైతన్నల సంక్షేమం కోసం వెనుకడుగు వేయదని ప్రభుత్వం కూడా తెలుపుతోంది.