పల్లె పండుగకు శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం.. ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు

www.mannamweb.com


అభివృద్ధి పనులు చేపట్టి.. పల్లెలకు పూర్వవైభవం తీసుకురావాలనే ఆలోచనలో కూటమి సర్కార్ తొలి అడుగు వేసింది. పల్లె పండుగ పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది.

‘పల్లెపండుగ’ వారోత్సవాల్లో భాగంగా 4వేల 500 కోట్లతో అభివృద్ధి పనులను ప్రభుత్వం చేపట్టింది. 30 వేల అభివృద్ధి పనులను చేస్తోంది. కృష్ణా జిల్లా కంకిపాడు వేదికగా పనులకు శంకుస్థాపన చేశారు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్. ఇందులో భాగంగా 3 వేల కిలోమీటర్ల సిమెంట్‌ రోడ్లు, మరో 500 కిలోమీటర్ల తారు రోడ్లు, 25 వేల గోకులాలు, 10 వేల వాన నీటి సంరక్షణ కందకాలతో పాటు గ్రామాల్లో అవసరమైన అనేక పనులను ప్రభుత్వం చేస్తోంది.

ఆగస్ట్ 23న గ్రామసభల్లో తీర్మానాలు

ఈ ఏడాది ఆగస్టు 23న 13వేల 326 పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేయించింది ప్రభుత్వం. ఆ సభల్లో తీర్మానించిన పనులను ప్రభుత్వం చేపట్టింది. ఈ నెల 20 వరకు కొనసాగే వారోత్సవాల్లో ఈ 30 వేల పనులకు శంకుస్థాపనలు చేయించి, సంక్రాంతిలోగా పనులు పూర్తి చేయించాలని ప్రభుత్వం భావిస్తోంది.

గత పాలనలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎవరో కూడా తెలీదు. గ్రామ సభలు పెట్టిన సందర్భమే లేదు. నిర్ణయాలు ఎలా తీసుకున్నారో.. డబ్బులు ఎలా ఖర్చయ్యాయో కూడా ఎవరికీ తెలీదన్న డిప్యూటీ సీఎం పవన్.. ఇప్పుడు ప్రజలే తమకు ఏం కావాలో తీర్మానించుకుంటున్నారన్నారు.

చంద్రబాబే స్ఫూర్తి అంటున్న పవన్

ఒకేరోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామసభలను ప్రభుత్వం నిర్వహించింది. దేశంలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. ఆయా పంచాయతీల్లో తీర్మానాలు చేసిన పనులకు ప్రభుత్వం నుంచి పరిపాలన, సాంకేతిక ఆమోదం లభించింది. గ్రామసభల్లో తీసుకున్న నిర్ణయాలు అమలుచేయడం అంత తేలిక కాదు. అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ పోవాలి. ఈ విషయంలో చంద్రబాబే తనకు స్ఫూర్తి అని అంటున్నారు డిప్యూటీ సీఎం పవన్.

పంచాయతీల్లో చేపట్టే పనులు.. డిస్‌ప్లే బోర్డుల్లో పెట్టాలనీ.. దాపరికం లేకుండా అన్ని వివరాలు అందులో ఉంచాలనీ అధికారులను పవన్ ఆదేశించారు. సంక్రాంతి నాటికి ఈ పనులు పూర్తి చేసి పల్లెలకు అసలైన పండుగ తీసుకురావాలనేది ప్రభుత్వ సంకల్పం.