Heavy Rains Alert: ఏపీకు భారీ వర్ష సూచన, రానున్న 5 రోజుల్లో ఈ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు
Heavy Rains Alert: నైరుతి రుతు పవనాలు బలపడటంతో పాటు గుజరాత్ మీదుగా ఆవహించిన ఆవర్తనం తూర్పు విదర్బ వరకూ ద్రోణి విస్తరించి ఉండటంతో ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు ప్రారంభమయ్యాయి.
రానున్న ఐదు రోజుల్లో ఇదే పరిస్థితి కొనసాగనుంది.
మొన్నటి వరకూ తీవ్ర ఉక్కపోత, వేడిమితో అల్లాడిన ఏపీ ప్రజానీకానికి కాస్త ఉపశమనం లభిస్తోంది. ఈ ఏడాది రుతు పవనాలు త్వరగానే ప్రవేశించినా చాలాకాలం నిస్తేజంగా మిగిలిపోయాయి. దాంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. జూన్ నెలాఖరులో ఇప్పుడు తిరిగి వర్షాలు మొదలయ్యాయి. వచ్చే ఐదు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా పడవచ్చు. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయనున్నాయి. ఉరుములు, మెరుపులతో పిడుగులు పడవచ్చు.
కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో రానున్న 5 రోజులు మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఇవాళ, రేపు కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కృష్ణా, పార్వతీపురం మన్యం జిల్లాల్లో భారీ వర్షాలకు ఆస్కారముంది. ఇవాళ మాత్రం విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, అనకాపల్లి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, పల్నాడు, బాపట్ల, చిత్తూరు, తిరుపతి , కడప, అన్నమయ్య జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి.
రేపు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, శ్రీకాకుళం, కాకినాడ, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి.