Ap High Court: ఏదైనా గ్రహానికి వెళ్లి రిపోర్టు తేవాలా?: ఏపీ హైకోర్టు ఆగ్రహం

గుంటూరు జిల్లాలోని వీరంకినాయుడుపాలెంలో అక్రమ మైనింగ్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఎం.ప్రభుదాస్‌ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.
రెండెకరాలకే అనుమతి తీసుకున్నారని.. 60 ఎకరాలకు ఫెన్సింగ్‌ వేసి అక్రమ మైనింగ్‌ చేస్తున్నారని పిటిషనర్‌ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. డీకే పట్టా భూముల్లో మైనింగ్‌ ఎలా చేస్తారని.. ఫిర్యాదులు వస్తున్నా ఎందుకు పట్టించుకోవట్లేదని ధర్మాసనం ప్రశ్నించింది.


రెండు వారాల్లో స్టేటస్‌ రిపోర్టు ఇవ్వాలని గనులశాఖను ఆదేశించింది. అయితే, రెండు వారాల సమయం సరిపోదని న్యాయవాది చెప్పడంతో.. ఏదైనా గ్రహానికి వెళ్లి రిపోర్టు తేవాలా అని వ్యాఖ్యానించింది. మైనింగ్‌ శాఖ ఇచ్చే నివేదికలో తేడాలు ఉండొద్దని.. అదే జరిగితే స్థానిక న్యాయాధికారితో విచారణ జరిపిస్తామని హెచ్చరించింది. అవసరమైతే గనుల శాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా అధికారిని కోర్టుకు పిలుస్తామని తెలిపింది. తప్పని తేలితే అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

సీఆర్‌జడ్‌లో నిర్మాణాలపై విచారణ..
భీమిలి కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌ (Coastal Regulation Zone)లో నిర్మాణాలపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. సీఆర్‌జడ్‌లో అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ జనసేన కార్పొరేటర్‌ మూర్తి యాదవ్‌ దాఖలు చేసిన పిల్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేసింది. బీచ్‌ వద్ద శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. విచారణ జరిపిన న్యాయస్థానం.. సీఆర్‌జడ్‌లో నిర్మాణాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని.. నిర్మాణ స్థలంలో ఉన్న యంత్రాలను సీజ్‌ చేయాలని సూచించింది. తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

రుషికొండ తవ్వకాలపై విచారణ వాయిదా..
విశాఖపట్నంలోని రుషికొండపై అక్రమ తవ్వకాలు, భవన నిర్మాణాలు, గ్రావెల్‌ తరలింపుపై ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖకు నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికపై తీసుకునే నిర్ణయాన్ని కోర్టుకు సమర్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది రెండు వారాల సమయం కోరారు. ఇప్పటికే పిటిషనర్ ఎన్జీటీకి వెళ్లగా డిస్మిస్ చేశారని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.