AP Mega DSC: మెగా డీఎస్సీతోపాటు టెట్‌

www.mannamweb.com


మరావతి: మెగా డీఎస్సీతోపాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నిర్వహించేందుకు కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో నిర్వహించిన టెట్‌లో అర్హత సాధించని వారు, ఈ టెట్‌ ప్రకటన తర్వాత బీఈడీ, డీఈడీ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నందున మెగా డీఎస్సీతోపాటు టెట్‌ నిర్వహించాలని నిర్ణయించింది. టెట్, మెగా డీఎస్సీకి ఒకేసారి కొంచెం తేదీల మార్పుతో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మొదట టెట్‌ నిర్వహిస్తారు. ఆ తర్వాత డీఎస్సీకి సన్నద్ధమయ్యేందుకు 30 రోజులు సమయం ఇవ్వాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. అనంతరం డీఎస్సీ పరీక్ష ఉంటుంది. జులై 1న మెగా డీఎస్సీ, టెట్‌కు ప్రకటనలు ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల డీఎస్సీ ప్రకటనను రద్దు చేసి, కొత్తగా 16,347 పోస్టులకు మెగా డీఎస్సీ ప్రకటన ఇస్తారు. గత డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న వారు రుసుములు చెల్లించాల్సిన అవసరం ఉండదు. కానీ, కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఏటా డీఎస్సీ
ప్రతి ఏడాదీ డీఎస్సీ నిర్వహించే అంశంపైనా ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఏ విద్యా సంవత్సరానికి ఆ సంవత్సరం వచ్చే ఖాళీలు, అవసరం మేరకు డీఎస్సీ నిర్వహిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎప్పటికప్పుడు ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని విద్యావేత్తలు పేర్కొంటున్నారు.

టెట్‌ ఫలితాలు నేడు..
ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు నిర్వహించిన టెట్‌ ఫలితాలను మంగళవారం విడుదల చేసేందుకు అధికారులు నిర్ణయించారు. ఈ టెట్‌కు 2.67లక్షల మంది దరఖాస్తు చేయగా.. 2.35లక్షల మంది పరీక్ష రాశారు. ఎన్నికల కోడ్‌ రావడంతో టెట్‌ ఫలితాల విడుదల వాయిదా పడింది.