ఏపీలో ఆరు కొత్త ఎయిర్ పోర్టులు..! సాధ్యాసాధ్యాలపై స‌ర్వే

www.mannamweb.com


ఏపీలో కొత్త విమానాశ్రయాలకు కసరత్తు జరుగుతోంది. ఆరు కొత్త ఎయిర్ పోర్టుల ఏర్పాటు కోసం సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వం స‌ర్వే చేయనుంది. ఈ కొత్త ఎయిర్‌పోర్టుల‌కు సంబందించిన ప్ర‌తిపాద‌న‌ల‌ను ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కు పంపింది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌రో ఆరు కొత్త ఎయిర్‌పోర్టులు రాబోతున్నాయి. ఈ మేర‌కు సాధ్యాసాధ్యాల‌పై స‌ర్వే చేయించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం సిద్ధ‌ప‌డింది. ఈ అధ్యయ‌నం తొమ్మిది అంశాల‌పై చేస్తారు. శ్రీ‌కాకుళం, కాకినాడ‌, ప‌శ్చిమ‌గోదావ‌రి, ప్ర‌కాశం, చిత్తూరు, పల్నాడు మొత్తం ఆరు జిల్లాల్లో కొత్త ఎయిర్ పోర్టుల‌ను పెట్టేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం యోచిస్తోంది.

రూ.2.27 కోట్లతో ప్రాథమిక సర్వే..!

శ్రీ‌కాకుళం జిల్లాలో 1,383 ఎక‌రాలు, కాకినాడ జిల్లాలోని తుని-అన్న‌వ‌రంలో 787 ఎక‌రాలు, ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో తాడేప‌ల్లిగూడెంలో 1,123 ఎక‌రాలు, ప్ర‌కాశం జిల్లాలో ఒంగోలులో 657 ఎక‌రాలు, చిత్తూరు జిల్లాలో కుప్పంలో 1,501 ఎక‌రాలు, ప‌ల్నాడు జిల్లాలోని నాగార్జున‌సాగ‌ర్‌లో 1,670 ఎక‌రాల భూములు అందుబాటులో ఉన్న‌ట్లు ప్ర‌భుత్వానికి నివేదిక అందింది. దీంతో ఆయా ప్రాంతాల్లో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్ పోర్టుల అభివృద్ధికి సాధ్యాసాధ్యాల‌ను ప‌రిశీలించేందుకు రూ.2.27 కోట్లు చేయ‌నుంది.

సానుకూల పరిస్థితులు…!

ఆంధ్ర‌ప్రదేశ్ ప్ర‌భుత్వం రాష్ట్రంలోని కొత్త ఎయిర్‌పోర్టుల ఏర్పాట్ల‌పై ఫోక‌స్ పెట్టింది. అందుకు కేంద్రంలోని పౌర విమాన‌యాన శాఖ మంత్రి కూడా టీడీపీకి చెందిన కె.రామ్మోహ‌న్ నాయుడే ఉండ‌టం సానుకూలంగా ఉంది. రాష్ట్రంలో ఇప్ప‌టికే విమాన స‌ర్వీసుల‌ను పెంచిన రామ్మోహ‌న్ నాయుడు,… ఇప్పుడు కొత్త ఎయిర్‌పోర్టుల‌కు అనుమ‌తి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఎయిర్‌పోర్టులు పెట్ట‌డానికి ట్రాఫిక్ కీల‌క‌మైన‌ది. ఆ ట్రాఫిక్ ఉండే ప్రాంతాల్లో ఎయిర్‌ఫోర్టు పెడుతూ రాష్ట్ర ప్ర‌భుత్వం డీపీఆర్ పంపిస్తే, వెంట‌నే అనుమ‌తి వ‌స్తుంది. ఒక‌వేళ ట్రాఫిక్ లేని చోట్ల విమాన‌శ్రయాలు పెడితే అవి న‌ష్టాల్లోకి వెళ్తాయి.
పీపీపీ మోడ‌ల్‌లో నిర్మాణం..?

దేశంలోని మెజార్టీ విమాన‌శ్ర‌యాలు అదానీ గ్రూప్స్ చేతిలో ఉన్నాయి. అయితే రాష్ట్రంలో ఇప్పుడు ఆరు ప్రాంతాల‌ను గుర్తించారు. ఆ ఆరు ప్రాంతాల్లో ఎయిర్‌పోర్టు పెట్టేందుకు అనువుగా ఉంటుందా? లేదా? అనే సాధ్యాసాధ్యాల‌పై స‌ర్వే చేస్తారు. అనువుగా అంటే సాంకేతిక అంశాల‌తో పాటు, ప్ర‌యాణికుల ట్రాఫిక్ కూడా కీల‌కంగా స‌ర్వే చేయ‌నున్నారు. ఆరు ప్రాంతాల్లో స‌ర్వే ముగిసిన త‌రువాత… కేంద్ర ప్ర‌భుత్వం అనుమ‌తి ఇస్తే పీపీపీ మోడ‌ల్‌లో నిర్మిస్తారని తెలిసింది.
కీలక ప్రతిపాదనలు…!

ఈ కొత్త ఎయిర్‌పోర్టుల‌కు సంబందించిన ప్ర‌తిపాద‌న‌ల‌ను ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కు ఇప్ప‌టికే రాష్ట్ర ప్ర‌భుత్వం పంపించింద‌ని రాష్ట్ర మంత్రి బీసీ జ‌నార్థ‌న్ రెడ్డి తెలిపారు. కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి భూముల‌ను గుర్తించి నివేదిక‌లు పంపాల‌ని ఏఏఐ నుంచి ఆదేశాలు రాష్ట్ర ప్ర‌భుత్వానికి అందాయ‌ని పేర్కొన్నారు. ఈ కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి ఆయా జిల్లా క‌లెక్ట‌ర్లు అందుబాటులో ఉన్న భూముల వివ‌రాల‌ను ప్ర‌భుత్వానికి పంపార‌ని అన్నారు.

జిల్లాల క‌లెక్ట‌ర్లు ఇచ్చిన నివేదిక ప్ర‌కారం శ్రీ‌కాకుళం జిల్లాలో 1,383 ఎక‌రాలు, కాకినాడ జిల్లాలోని తుని-అన్న‌వ‌రంలో 787 ఎక‌రాలు, ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో తాడేప‌ల్లిగూడెంలో 1,123 ఎక‌రాలు, ప్ర‌కాశం జిల్లాలో ఒంగోలులో 657 ఎక‌రాలు, చిత్తూరు జిల్లాలో కుప్పంలో 1,501 ఎక‌రాలు, ప‌ల్నాడు జిల్లాలోని నాగార్జున‌సాగ‌ర్‌లో 1,670 ఎక‌రాల భూములు అందుబాటులో ఉన్నాయ‌ని తెలిపారు. కొత్త ఎయిర్‌పోర్టుల‌కు సంబంధించి తొమ్మిది అంశాల‌పై ప్రాథ‌మిక అధ్య‌య‌నం చేస్తామ‌ని అన్నారు. అందుకోసం ఒక్కో ఎయిర్‌పోర్టుకు రూ.37 ల‌క్ష‌లు అవస‌రం అవుతోంద‌ని, మొత్తం ఆరు ఎయిర్‌పోర్టుల‌కు క‌లిపి రూ.2.27 కోట్ల‌ను విడుద‌ల చేస్తున్నామ‌ని వివరించారు.