అమరావతి: జగన్ ప్రభుత్వం( YS Jagan Govt)లో సలహదారుగా వ్యవహరిస్తున్న చంద్రశేఖర్ రెడ్డిని వెంటనే ఆ పదవిలో నుంచి తొలగించాలని రాష్ట్ర ఎన్నికల సీఈవో ముఖేష్ కుమార్ మీనా (MK Meena)కు ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ విజ్జప్తి చేసింది.
ఎన్నికల వేళ చంద్రశేఖర్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసింది. ఆయన్ని వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలంటూ.. సీఈవో మీనాను కలిసి విజ్జప్తి చేసింది. అనంతరం ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు సుబ్బరాయన్ మాట్లాడుతూ.. ఉద్యోగుల సంక్షేమం చూడాల్సిన సలహదారు చంద్రశేఖర్ రెడ్డి రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాలను విమర్శిస్తూ.. వైసీపీకి ఓట్లు వేయాలంటూ ఉద్యోగులు, వాలంటీర్లను ఆయన ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు. చంద్రశేఖరరెడ్డి హయాంలో ఉద్యోగుల సంక్షేమం ఏ మాత్రం జరగలేదని ఆయన స్పష్టం చేసింది.
ఉద్యోగులకు రివర్స్ పీఆర్సీ రావడం, క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పోవడం, డీఏ బకాయిలు, పీఆర్సీ బకాయిలు వంటి సమస్యలు ఎన్నో ఉన్నాయని.. వాటి వేటిని ఆయన అసలు పట్టించుకోలేదని మండి పడ్డారు. అయితే ఆయన తన జీతభత్యాల కోసం, టీఏ, డీఏల కోసం తన హోదాను చూపించుకోవడం కోసం ప్రభుత్వ సలహదారుడిగా ఉంటున్నారని తెలిపారు. ఇక పెన్షనర్స్ కోసం, ఉద్యోగుల కోసం ఆయన ఏ మాత్రం పని చేయలేదని చెప్పారు.
చంద్రశేఖరరెడ్డి ఉద్యోగ సంఘం నేతగా, మాజీ ఉద్యోగిగా ఉద్యోగులను ప్రలోభపెడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో తన కార్యాలయాన్ని దుర్వినియోగం చేసి రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ నిబంధనలను అనుసరించి వెంటనే ఆ పదవి నుంచి చంద్రశేఖరరెడ్డిని తప్పించాలని ఎన్నికల సంఘం సీఈవోని కోరినట్లు చెప్పారు. ఈ విషయంలో గవర్నర్, ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి కలుగ చేసుకొని చంద్రశేఖర్ రెడ్డిని ప్రభుత్వ సలహదారు పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.