నగదు పురస్కారాలు రూ.250 కోట్ల నుంచి రూ.500 కోట్లకు పెంపుఎన్నికల ముందు జగన్ ప్రభుత్వం వల్లమాలిన ప్రేమ
ప్రజాధనం మంచినీళ్లలా ఖర్చు
ఈనాడు, అమరావతి: వాలంటీర్లకు ఎన్నికల ముందు మరింతగా తాయిలాలు ఎరవేసి వారితో పార్టీ పని చేయించుకునేందుకు జగన్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ వేసింది.
ఏటా పురస్కారాల పేరుతో వారికి ఇస్తున్న తాయిలాల మొత్తాన్ని ఒక్కసారిగా రెట్టింపు చేయబోతోంది. వాలంటీర్లంతా వైకాపా వారేనని ముఖ్యమంత్రి, ఆ పార్టీ నాయకులు బహిరంగంగానే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పురస్కారాల కింద ఏటా ఇస్తున్న మొత్తాన్ని రూ.250 కోట్ల నుంచి రూ.500 కోట్లకు పెంచేందుకు రంగం సిద్ధం చేయడం చర్చనీయాంశమవుతోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలకు ప్రభుత్వం కొద్ది రోజుల్లోనే ఆమోదం తెలియజేయనుంది. అవార్డుల ప్రదానోత్సవ సభల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలొచ్చినట్లు తెలుస్తోంది. సేవా వజ్ర అవార్డు కింద ఇచ్చే రూ.30 వేల నగదు పురస్కారాన్ని రూ.60 వేలకు పెంచనున్నారు. సేవారత్న పేరిట ఇచ్చే రూ.20 వేలు రూ.40వేలకు, సేవామిత్ర అవార్డు కింద ఇస్తున్న రూ.10 వేలు రూ.20 వేలకు పెరగనుంది. వాలంటీర్ల పనితీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం ఇవేవీ పట్టించుకోకుండా నగదు పురస్కారాలు రెట్టింపు చేయాలనుకోవడం బరి తెగింపే అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఎన్నికల్లో వీరి సేవలను మరింతగా వినియోగించుకునేందుకు ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని విమర్శిస్తున్నాయి.
అధికారపార్టీని అభిమానించే వారికి ప్రజాధనమా?
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికీ చేరవేసే పేరుతో జగన్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షలకుపైగా గ్రామ, వార్డు వాలంటీర్లను నియమించింది. ఒక్కో వాలంటీర్‌కు నెలకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తోంది. ‘వాలంటీర్లు ఎవరో కాదు…మన పార్టీని అభిమానించే…మనలో నుంచి వచ్చిన మనవారే’ అని సీఎం జగన్ ఇటీవల బాహాటంగానే ప్రకటించారు. వాలంటీర్లు వైకాపా కోసం పని చేస్తున్న కార్యకర్తలని మంత్రి అంబటి రాంబాబు స్వయంగా చెప్పారు. వీరికి ఇస్తున్న గౌరవ వేతనానికి అదనంగా ప్రభుత్వం ఏటా అవార్డులిస్తోంది. నియోజకవర్గానికి అయిదుగురు చొప్పున 875 మందిని సేవా వజ్ర అవార్డుకు ఎంపిక చేస్తోంది. ప్రతి మండలం, మున్సిపాల్టీ నుంచి అయిదుగురు చొప్పున, నగరపాలక సంస్థ నుంచి 10 మంది చొప్పున మొత్తంగా 4,220 మందికి సేవా రత్న అవార్డు, మిగిలిన వారికి సేవా మిత్ర అవార్డులిస్తోంది. ఇప్పుడు ఎన్నికల ముంగిట వాలంటీర్లను మెప్పించి, పార్టీకి అనుకూలంగా పనిచేయించుకోవడానికి నగదు పురస్కారం రెట్టింపుచేస్తోందని విపక్షాలు మండిపడుతున్నాయి.