ఏపీలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొన్ని జిల్లాల్లో ఎండలు భగభగ మండుతుంటే.. మరి కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు దంచి కొడుతున్నాయి. మరో రెండు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా భిన్నమైన వాతావరణ పరిస్థితులే ఉంటాయని వాతావారణ శాఖ అధికారులు తెలిపారు.
ఐఎండి సూచనల ప్రకారం ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈరోజు(07-04-25) ఉదయం 08.30 గంటలకు దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. ఇది రేపటి(ఏప్రిల్ 8) వరకు వాయువ్య దిశగా నైరుతి బంగాళాఖాతం వైపు కదిలే అవకాశం ఉందని ఆ తర్వాత 48 గంటల్లో ఉత్తర దిశగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వైపుగా కదిలే అవకాశం ఉందన్నారు.
దీని ప్రభావంతో గురు,శుక్రవారాల్లో (10, 11 తేదీల్లో) ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. రేపు, ఎల్లుండి(ఏప్రిల్ 8, 9) అకస్మాత్తుగా పిడుగులతో కూడిన అవకాశం ఉందన్నారు. ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల క్రింద నిలబడరాదని, రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
సోమవారం నంద్యాలలో 41.5°C, కర్నూలు(D) నడిచాగిలో 41.1°C, వైఎస్సార్(D) బలపనూరులో 41°C, ప్రకాశం(D) నందనమారెళ్ళలో 40.8°C, తిరుపతి(D) గూడూరు, విజయనగరం(D) నెలివాడలో 40.6°C, చిత్తూరు(D) నగరిలో 40.5°C, అన్నమయ్య(D) కంభంవారిపల్లె 40.4°C, పల్నాడు(D) రావిపాడులో 40°C చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైందన్నారు. వైఎస్సార్ జిల్లాలో 14, నంద్యాల జిల్లాలో 10చోట్ల, ఇతర జిల్లాల్లో 15, మొత్తంగా కలిపి 39 చోట్ల 40°Cకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు వెల్లడించారు.
ఎండతీవ్రంగా ఉండి బయటకు వెళ్లేప్పుడు తలకు టోపి, కర్చీఫ్ కట్టుకోవాలి, గొడుగు ఉపయోగించాలి. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని, శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయరాదని సూచించారు.