ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఏపీ సెట్)-2024 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఏడాది కూడా ఆంధ్రా యూనివర్సిటీ సెట్ పరీక్షను నిర్వహిస్తోంది.
రాష్ట్రంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్ పోస్టులకు అర్హత సాధించేందుకు ప్రతీయేట రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సెట్ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతలు ఆంధ్రా యూనివర్సిటీ చూస్తోంది. జనరల్ స్టడీస్‌తోపాటు 30 సబ్జెక్టుల్లో ఏపీ సెట్ పరీక్ష నిర్వహిస్తారు. సంబంధిత సబ్జెక్టులో కనీసం 50 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత పొందిన వారు ఈ పరీక్ష రాసేందుకు అర్హులు. గరిష్ఠ వయోపరిమితి అంటూ ఏమీ ఉండదు.
పరీక్ష విధానం..
పేపర్ 1 పరీక్ష జనరల్ పేపర్‌కి ఉంటుంది. టీచింగ్ అండ్ రిసెర్చ్ ఆప్టిట్యూడ్ అంశాల నుంచి ఈ పేపర్‌లో ప్రశ్నలు అడుగుతారు.
పేపర్ 2 పరీక్ష సంబంధిత స్పెషలైజేషన్‌లో ఉంటుంది. ఆంత్రోపాలజీ, హిస్టరీ, కెమికల్ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, ఎర్త్- అట్మాస్పియరిక్- ఓషన్ అండ్ ప్లానెటరీ సైన్స్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, జాగ్రఫీ, హిందీ, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్, లా, లైఫ్ సైన్సెస్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, మేనేజ్‌మెంట్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సంస్కృతం, సోషియాలజీ, సోషల్ వర్క్, తెలుగు, ఉర్దూ, విజువల్ ఆర్ట్స్.. ఇలా మొత్తం 30 సబ్జెక్టులకు పరీక్ష ఉంటుంది.
పరీక్షకు రెండు పేపర్లు ఉంటాయి. ఒకటే రోజున రెండు పేపర్లకు పరీక్ష నిర్వహిస్తారు. పేపర్-1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయిస్తారు. పేపర్-2లో 100 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు. మూడు గంటల వ్యవధిలో పరీక్ష రాయవల్సి ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్/ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన అభ్యర్ధులు రూ.1200, బీసీ కేటగిరీకి చెందిన వారు రూ.1000, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ ట్రాన్స్‌జెండర్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు రూ.700ల చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీల వివరాలు..
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: ఫిబ్రవరి 14, 2024.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 06, 2024.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఏపీ సెట్)-2024 పరీక్ష తేదీ: ఏప్రిల్ 28, 2024.