AP Telangana Weather: భానుడి ప్రతాపానికి అల్లాడిపోతున్న తెలుగు ప్రజలు, నేడు 130 మండలాల్లో వడగాల్పులు: IMD అలర్ట్

www.mannamweb.com


Heat Waves In AP And Telangana: తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భానుడి భగభగలతో ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. ఏపీ, తెలంగాణలో దాదాపు అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
కొన్ని జిల్లాల్లో 43 డిగ్రీల గరిష్ణ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, వడగాలులకు వయసు మీద పడిన వారు తట్టుకోలేకపోతున్నారు. ఏపీలో గురువారం (ఏప్రిల్ 4న) 130 మండలాల్లో వడగాల్పులు వీచనున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

బుధవారం నాడు (ఏప్రిల్ 3న) వైయస్సార్ కడప జిల్లా ఒంటిమిట్టలో అత్యధికంగా 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అనంతపురం జిల్లా తెరన్నపల్లి, ప్రకాశం జిల్లా దరిమడుగు, నంద్యాల జిల్లా బ్రాహ్మణకొట్కూరులో 43.3 డిగ్రీలు, కర్నూలు జిల్లా లద్దగిరిలో 43.2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారుు వెల్లడించారు. కడప జిల్లా వీరాపునాయుని మండలంలో తీవ్రవడగాల్పులు, 59 మండలాల్లో వడగాల్పులు వీచాయని.. ప్రజలు మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య అత్యవసరమైతే తప్పా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు.
తెలంగాణలోనూ సుర్రుముంటున్న సూరీడు..
తెలంగాణలోనూ భానుడి ప్రతాపం చూపుతున్నాడు. పలు జిల్లాల్లో 40కి పైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. పలు జిల్లాల్లో 43 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిర్మల్ జిల్లా నర్సాపూర్లో అత్యధికంగా 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కరీంనగర్, వరంగల్, ములుగు జిల్లాలో పలు చోట్ల 42, 43 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ప్రజలు అత్యవసరమైతేనే ఎండ అధికంగా ఉన్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది. క్యాప్ ధరించి ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలని, నీళ్లు అధికంగా తీసుకోవాలని జాగ్రత్తలు చెప్పింది. గ్రేటర్ హైదరాబాద్ (GHMC) పరిధిలో 42 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చందానగర్, ఖైరతాబాద్, మూసాపేట ప్రాంతాల్లో 41, 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో పాటు వడగాల్పుల ప్రభావంతో నగరవాసులు ఎండలకు అల్లాడిపోతున్నారు.

గురువారం 130 మండలాల్లో వడగాల్పులు
ఏప్రిల్ 4న పార్వతీపురంమన్యం జిల్లా కొమరాడలో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉంది. అలాగే 130 మండలాల్లో వడగాల్పులు, ఏప్రిల్ 5వ తేదీన 5 మండలాల్లో తీవ్ర, 253 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.

ఏప్రిల్ 4న వడగాల్పులు వీచే మండలాలు 130 మండలాలు ఇవే
శ్రీకాకుళం జిల్లాలో 4 మండలాలు, విజయనగరం జిల్లాలో 19, పార్వతీపురంమన్యం జిల్లాలో 12, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 4 మండలాలు, అనకాపల్లి జిల్లాలో 13, కాకినాడ జిల్లాలో 9, తూర్పు గోదావరి జిల్లాలో 3 మండలాలు, కృష్ణా జిల్లాలో ఒక్క మండలం, ఎన్టీఆర్ జిల్లాలో 14 మండలాలు, గుంటూరు జిల్లాలో 5, పల్నాడు జిల్లాలో 6, నంద్యాల జిల్లాలో 19 మండలాలు, వైఎస్సార్ జిల్లాలో 20 మండలాల్లో, అనంతపురం జిల్లాలో ఒక్క మండంలో గురువారం నాడు వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఈ ప్రాంతాల ప్రజలు ఎండల నుంచి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

వేసవిలో ప్రజలు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
ప్రజలు వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలని వాతావరణ కేంద్రం అధికారులు సూచించారు. ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు లాంటివి తాగాలని ఏపీ విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ సూచించారు.