AP Volunteers: ఏపీలో అసలు వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందా? కొనసాగించే ఉద్దేశం ఉందా? రాజీనామా చేయని వారిని కొనసాగిస్తారా? కొత్త వారిని తీసుకుంటారా? తీసుకుంటే ఏ మార్గదర్శకాలు పాటిస్తారు? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. అయితే అసలు వాలంటీర్ వ్యవస్థ ఉండదని తెలుస్తోంది. పూర్తిగా భర్తీ చేసే అవకాశం లేదని సమాచారం. సచివాలయ వ్యవస్థ తోనే పల్లె పాలనను కొనసాగిస్తారని తెలుస్తోంది. అయితే ఈ అనుమానాలను నిజం చేస్తూ.. క్యాబినెట్ లో సీనియర్ మంత్రి కీలక వ్యాఖ్యలు చేయడం విశేషం.
ప్రస్తుతం ఏపీలో వాలంటీర్ల చుట్టూనే రాజకీయం నడుస్తోంది. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ను నియమించింది. సంక్షేమ పథకాలతో పాటు పౌర సేవల బాధ్యతలను అప్పగించింది. అయితే వాలంటీర్లంతా వైసిపి సానుభూతిపరులు అని విపక్షాలు అప్పట్లో ఆరోపించాయి. ఈ క్రమంలో ఎన్నికల విధుల నుంచి వారిని తొలగించాలని ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో ఎన్నికల సంఘం వాలంటీర్లను విధుల నుంచి దూరంగా ఉండాలని ఆదేశించింది. ఈ తరుణంలో ఎన్నికల్లో వాలంటీర్ వ్యవస్థ ప్రచారాస్త్రంగా మారింది. టిడిపి అధికారంలోకి వస్తే వాలంటీర్లను తొలగిస్తారు అంటూ వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దానిపై టిడిపి నేతలు కూడా కౌంటర్ ఇచ్చారు. పాము అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్లకు గౌరవ వేతనంగా పదివేల రూపాయలు అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయినా సరే చాలామంది వలంటీర్లు వైసీపీకి మద్దతుగా రాజీనామా చేశారు. ఇప్పుడు వైసిపి ఓటమి చవిచూడడంతో వాలంటీర్లు మాట మార్చారు. వైసీపీ నేతలే తమతో బలవంతంగా రాజీనామా చేయించారని.. తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అయితే చంద్రబాబు హామీ ఇచ్చినందున తమను కొనసాగిస్తారన్న ఆశ వాలంటీర్లలో ఉంది. మరోవైపు టిడిపి శ్రేణులు సైతం వాలంటీర్ పోస్టులపై ఆశలు పెట్టుకున్నాయి. టిడిపి శ్రేణులనుంచి విపరీతమైన పోటీ ఉంది. వీటిని భర్తీ చేస్తే గ్రామస్థాయిలో విభేదాలు తలెత్తే అవకాశం ఉందని కూడా టిడిపి నాయకత్వం భయపడుతోంది. గ్రామానికి ఐదుగురు వాలంటీర్లను మాత్రమే తీసుకునే యోచనలో ఉన్నారని.. అది కూడా డిగ్రీ పూర్తి చేసిన వారికే ఛాన్స్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై విధి విధానాలు రూపొందించిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ పై కీలక ప్రకటన చేయడానికి టిడిపి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. అదే సమయంలో వాలంటీర్లను తొలగించాలంటూ హైకోర్టులో ప్రత్యేక పిటిషన్ దాఖలు అయింది. వారి నియామకాల్లో రిజర్వేషన్లు పాటించలేదని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు.
ఇది ఇలా ఉంటే క్యాబినెట్ లో సీనియర్ మంత్రిగా ఉన్న ఆనం రామనారాయణరెడ్డి వాలంటీర్ వ్యవస్థ పై సంచలన కామెంట్స్ చేశారు. ఏపీలో వాలంటీర్ వ్యవస్థ ఉండొచ్చు.. ఉండకపోవచ్చు అని అభిప్రాయపడ్డారు. గతంలో వాలంటీర్ల మాదిరిగానే ఇంటి ఇంటికి పింఛన్లు పంపిణీ సచివాలయ ఉద్యోగులతో చేపడుతున్నట్లు తెలిపారు. వాలంటీర్లను నియమిస్తే కేవలం పింఛన్ల పంపిణీ పరిమితం చేయమని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఒకవైపు విధివిధానాలు తయారవుతున్నాయని చెబుతూనే.. వాలంటీర్ వ్యవస్థ ఉండకపోవచ్చు అని వ్యాఖ్యానించడం విశేషం. దీంతో రాజీనామా చేయని వాలంటీర్లు సైతం తలలు పట్టుకుంటున్నట్లు తెలుస్తోంది.