ఆక్రమణల తొలగింపునకు ఏపీలో పటిష్ట చట్టం.. హైడ్రా కావాలంటోన్న ఏపీ ప్రజలు

www.mannamweb.com


పది రోజులు కావస్తున్నా విజయవాడ ప్రజలు వరద ముంపులోనే అష్ట కష్టాలు పడుతున్నారు. మరి ఇన్ని కష్టాలకు ఒకే ఒక్క కారణం బుడమేరు ఉప్పొంగడమే. ఒకే ఒక్క రాత్రి అంతలా ఉగ్రరూపం దాల్చదానికి కారణాలు ఏమిటని తరచి చూస్తే… మానవ తప్పిదాలే కనిపిస్తున్నాయి.

జలవనరులను ఎడాపెడా ఆక్రమించి ప్రకృతి విరుద్ధంగా ప్రవహిస్తే ఫలితం ఎలా ఉంటుందో అన్నదానికి ఆ తప్పులు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. బుడమేరు కాలువ వెంట విచ్చలవిడి ఆక్రమణలు ప్రజల పాలిట శాపంగా మారడంతో… దీనిపై ఏపీ సర్కార్‌ సీరియస్‌గా దృష్టి పెట్టింది. విజయవాడకు మరో సారి వరద కష్టం రాకుండా… నగరానికి దుఃఖదాయినిగా మారిన బుడమేరు ప్రక్షాళనకు రెడీ అయింది. ఆపరేషన్‌ బుడమేరు చేపట్టి… భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బంది కాకుండా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు. రాజకీయ నేతల అండతో కొందరు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని… ఇక నుంచి చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. బుడమేరు ఆక్రమణల తొలగింపునకు పటిష్ట చట్టం తెస్తామన్నారు చంద్రబాబు. ప్రజల భద్రత కంటే తనకు మరేమీ ఎక్కువ కాదని తేల్చి చెప్పారు.
కొల్లేరులో ఆక్రమణలు వల్ల నీరు వెనక్కి తన్నే పరిస్థితి ఉందని, దీనిని పరిశీలించి ఆక్రమణలు కొట్టేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. మరోవైపు అక్రమణల తొలగింపునకు హైడ్రా తరహా వ్యవస్థ తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. హైడ్రాను ఏపీ ప్రజలతోపాటు రాజకీయ నేతలకు కూడా స్వాగతిస్తున్నారు. ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాన్‌పై పాజిటీవ్‌గా స్పందించారు. ఈ మధ్య విజయవాడ వరదలకు కారణమైన బుడమేరు గురించి మాట్లాడుతూ హైడ్రా ప్రస్తావన తీసుకొచ్చిన పవన్‌… చెరువులను కాపాడే విషయంలో రేవంత్ మంచిపని చేశారన్నారు.

ఇక ఏలేరు ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ఉద్ధృతిని నిశితంగా పరిశీలిస్తూ అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు చంద్రబాబు. విశాఖ, అల్లూరి జిల్లాల్లో కొండ చరియలు విరిగిపడే ప్రమాదం గుర్తించి ముందస్తు హెచ్చరికలు పంపామని తెలిపారు.

మొత్తంగా భారీ వర్షాలతో అలర్ట్‌ జారీ చేస్తూ… ఓ వైపు సహాయక చర్యలను కొనసాగిస్తూనే… మరోవైపు విజయవాడలో వరదలకు కారణమైన బుడమేరు అక్రమణల తొలగింపుకు సిద్ధమైంది ఏపీ ప్రభుత్వం.