Chinta Mohan: ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా తొందరలోనే వస్తుంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్.. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం వద్ద నిరసన వ్యక్తం చేసిన ఆయన..
తిరుమలలో గత ఐదేళ్లుగా ఇచ్చిన బ్రేక్ దర్శనం వివరాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు.. ఇక, జూ పార్క్ ను వడమాలపేటకు తరలించి ఇక్కడ టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. తిరుపతిలో క్రికెట్ స్టేడియం నిర్మాణం కోసం నేను ఎంపీగా ఉన్నపుడు అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి.. భూమి పూజ చేసి పునాది రాయి వేశాం.. క్రికెట్ స్టేడియం కోసం వేసిన పునాది రాయి అనాది రాయి కాకుండా నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు..
ఇక, తిరుపతిలో పది ప్రాంతాల్లో పిల్లలకు ఆట స్థలాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు చింతామోహన్.. ఇందుకు కార్పొరేషన్ కమిషనర్ టాప్ ప్రియారిటీ ఇవ్వాలని సూచించారు. రాష్ట్ర విభజనకు కారణం కాంగ్రెస్ పార్టీ కాదు.. వైఎస్.., వైఎస్ జగనే కారణంగా చెప్పుకొచ్చారు.. కాంగ్రెస్ పార్టీలోనే వైఎస్ జగన్ ఉంటే.. విభజన జరిగి ఉండేది కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కాంగ్రెస్ ను బలహీన పర్చారని మండిపడ్డారు.. అయితే, ఏపీకి ప్రత్యేక హోదా తొందరలోనే వస్తుందని పేర్కొన్నారు. కాగా, కేంద్రంలో మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ.. రాహుల్ గాంధీతో సహా.. కాంగ్రెస్ నేతలు ప్రకటించిన మాట విదితమే.. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి రాకపోగా.. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని ఇప్పటి నేతలు అంటుండగా.. కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ మాత్రం.. త్వరలోనే ఏపీకి ప్రత్యేక హోదా అంటూ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.