ఇక మూడు జోన్లుగా ఏపీ..! ఏ జిల్లా ఎందులోకి ? చంద్రబాబు భారీ ప్లాన్..

ర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ను గాడినపెట్టడంతో పాటు ఆర్ధిక వృద్ధిని వేగవంతం చేసేందుకు వీలుగా సీఎం చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.


ఇందుకోసం రాష్ట్రాన్ని మొత్తం మూడు భాగాలుగా (జోన్లు) విభజించారు. జిల్లాల్ని ఆయా జోన్లలో కేటాయించారు. వీటికి ప్రత్యేక బోర్డుల ఏర్పాటు, అధికారుల కేటాయింపు కూడా చేస్తున్నారు. ఈ మేరకు రేపు, ఎల్లుండిలో కీలక ఉత్తర్వులు రానున్నాయి.

రాష్ట్రాన్ని విశాఖ, అమరావతి, రాయలసీమ ఆర్ధిక జోన్లుగా విభజిస్తున్నారు. ఈ మూడు జోన్లకూ ప్రత్యేక బోర్డుల్ని, అధికారుల్ని నియమిస్తున్నారు. ఇప్పటికే విశాఖ జోన్ కు ఐఏఎస్ యువరాజ్ సీఈవోగా ఉన్నారు. అలాగే అమరావతికి ముకేష్ కుమార్ మీనా, రాయలసీమకు కృష్ణబాబు వంటి సీనియర్ ఐఎఎస్ లను సీఈవోలుగా నియమించబోతున్నారు. ప్రతీ జోన్ లోనూ మూడు రకాల కమిటీల్ని ఏర్పాటు చేయబోతున్నారు.

ఇందులో విశాఖ జోన్ లోకి 9 జిల్లాలు రాబోతున్నాయి. అలాగే అమరావతి జోన్ లోకి 8 జిల్లాలు, రాయలసీమ జోన్ లోకి 9 జిల్లాలు రాబోతున్నాయి. రాయలసీమ జోన్ కు తిరుపతి కేంద్రంగా ఉండబోతోంది. విశాఖ జోన్ లోకి వచ్చే 8 జిల్లాల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ ఉన్నాయి. అలాగే అమరావతి జోన్ లోకి పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలు రానున్నాయి. చివరిగా రాయలసీమ జోన్లోకి నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, కడప, అనంతపురం, సత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాలు వస్తాయి.

ఈ మూడు ఎకనామిక్ జోన్లకు కలిపి సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఓ స్టీరింగ్ కమిటీ ఉంటుంది. అలాగే సీఈవోగా ఓ సీనియర్ ఐఏఎస్ ను నియమిస్తారు. సభ్యులుగా మంత్రులు, ఎమ్మెల్యేలను నియమిస్తారు. ఎగ్జిక్యూటివ్ కమిటీలో అధికారులు ఉంటారు. అలాగే ఇంప్లిమెంటేషన్ కమిటీలో కలెక్టర్లతో పాటు మున్సిపల్ కమిషనర్లు ఉంటారు. వీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంతో పాటు అమలు చేస్తారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.