3 రోజులు.. 3 విమానాల్లో అమెరికాకు యాపిల్‌ ఫోన్ల ఎగుమతి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధించిన ప్రతీకార సుంకాలను తప్పించుకునే లక్ష్యంతో యాపిల్‌ కంపెనీ కేవలం మూడు రోజుల వ్యవధిలో భారత్‌ నుంచి నిండుగా లోడ్‌ చేసిన మూడు విమానాల్లో ఐఫోన్లను…


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధించిన ప్రతీకార సుంకాలను తప్పించుకునే లక్ష్యంతో యాపిల్‌ కంపెనీ కేవలం మూడు రోజుల వ్యవధిలో భారత్‌ నుంచి నిండుగా లోడ్‌ చేసిన మూడు విమానాల్లో ఐఫోన్లను అమెరికాకు తరలించింది. సీనియర్‌ భారత ప్రభుత్వ అధికారులు ఈ విషయం ధ్రువీకరించారు. ట్రంప్‌ ప్రభుత్వం 10ు టారి్‌ఫల ప్రకటన వెలువడడం కన్నా ముందు మార్చి చివరి వారంలో ఈ ఐఫోన్ల తరలింపు జరిగిందన్నారు. అంతేకాదు కొత్త టారి్‌ఫలు అమలులోకి వచ్చినప్పటికీ భారత్‌లో గాని, ఇతర దేశాల మార్కెట్లో గాని తక్షణ చర్యగా ఐఫోన్ల ధరలు పెంచే ఆస్కారం లేదని యాపిల్‌ స్పష్టం చేసింది. సాంప్రదాయికంగా వస్తు రవాణా పరిశ్రమకు ఇది అంత రద్దీ ఉండని సమ యం. అయినప్పటికీ ట్రంప్‌ చర్యల నేపథ్యంలో చైనా, భారతదేశాల్లోని తమ ఫ్యాక్టరీల నుంచి భారీగా యాపిల్‌ కంపెనీ ఐఫోన్లను తరలించిందని వారు తెలిపారు. టారిఫ్‌లకు ముందే భారీ పరిమాణంలో ఐఫోన్ల తరలింపు వల్ల యాపిల్‌ కంపెనీ స్థిరమైన ధరలను నిర్వహించగలిగిందంటున్నారు. దీంతో అమెరికాలోని యాపిల్‌ కంపెనీ గిడ్డంగులన్నీ భారీ ఐఫోన్‌ నిల్వలు కలిగి ఉన్నాయి.

అలాగే కొత్త టారి్‌ఫల ప్రభావం తమపై ఎంత మేరకు ఉంటుందని మదింపు చేసుకునే లోగా ధరలు పెంచే పని లేకుండా జరిగిపోయింది. భారత్‌ నుంచి ఈ ఆకస్మిక ఎగుమతుల వృద్ధి ఒక్క యాపిల్‌కే పరిమితం కాలేదు. ముంబై నుంచి వజ్రాభరణాల ఎగుమతులు సైతం ఏప్రిల్‌ 1-4 తేదీల మధ్య కాలంలో ఆరు రెట్లు పెరిగి 34.4 కోట్ల డాలర్లకు చేరినట్టు చెబుతున్నారు. అలాగే దుస్తుల ఎగుమతుల్లో కూడా వేగం పెరిగింది.