తెలంగాణ రాష్ట్ర గీతానికి ఆమోదం.. మార్చిన గీతం ఇదే!

Telangana State Song: జయ జయహే తెలంగాణ రాష్ట్ర గీతానికి రాజకీయపక్షాలు, ఉద్యమకారులు ఆమోదం తెలిపారు. ఈ రోజు వారితో సీఎం జరిపిన సమావేశంలో జయ జయహే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రతిపాదించారు.


ఈ సమావేశంలోనే జయ జయ తెలంగాణ గీతాన్ని కీరవాణి (MM Keeravani), సింగర్ రేవంత్ బృందం పాడి వినిపించింది. గీతంపై సీపీఐ, సీపీఎం, తెలంగాణ జన సమితి నేతల, కవులు, కళాకారులు, మేధావులు, ఉద్యమకారులు, జేఏసీ నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర గీతంలో మగ్దుం మొహియుద్దీన్, షేక్ బందగి, కొమరం భీమ్ లాంటి తెలంగాణ సాయుధ పోరాట యోధుల పేర్లు చేర్చాలని సీపీఐ సూచించినట్లు తెలుస్తోంది.


అయితే.. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కొన్ని చరణాలను ఈ గీతంలో మార్చినట్లు సమాచారం. పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం, గోదావరి కృష్ణమ్మలు తల్లీ నినున్న తడపంగా, పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా.. అంటూ కొత్త చరణాలను చేర్చినట్లు తెలుస్తోంది.

తెలంగాణ గీతానికి కాంగ్రెస్ మిత్ర పక్షాల మద్దతు లభించిందని సీఎం రేవంత్ (CM Revanth Reddy) సమావేశం అనంతరం ప్రకటించినట్లు సమాచారం. ఈ గీతాన్ని జూన్ 2న జాతికి అంకితం చేయనున్నట్లు సీఎం వెల్లడించినట్లు తెలుస్తోంది. తెలంగాణ చిహ్నంపై కూడా కసరత్తు జరుగుతోందని ఆయన చెప్పినట్లు సమాచారం. మరో సమావేశం తర్వాత చిహ్నాన్ని ఖరారు చేస్తామని సీఎం చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో జూన్ 2నే తెలంగాణ రాష్ట్ర కొత్త రాజముద్రను ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది.