ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో నిర్వహించనున్న గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష మరోసారి వాయిదా పడింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) అధికారిక ప్రకటనను విడుదల చేసింది.
ఏపీపీఎస్సీ ఇటీవల ప్రకటించిన షెడ్యూల్ మేరకు గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలను వచ్చే ఏడాది జనవరి 5వ తేదీన నిర్వహించనున్నట్లు విషయం తెలిసిందే. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ, పరీక్షా కేంద్రాల గుర్తింపు, అభ్యర్థుల సన్నద్ధతను దృష్టిలో పెట్టుకుని ఈ మేరకు గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష తేదీని మార్చినట్లు సమాచారం. త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నెలలోనే దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసి వచ్చే ఏడాది ఫిబ్రవరి 3 నుంచి మార్చి 4వ తేదీ మధ్య రాత పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు గతంలో పరీక్షల తేదీలను కూడా వెల్లడించింది. డీఎస్సీ పరీక్షల తర్వాత ఇంటర్, పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో అన్ని చోట్ల పరీక్షా కేంద్రాలు బిజీగా ఉండనున్నాయి.
మరోవైపు గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష రాసేవారిలో కొంత మంది డీఎస్సీకి కూడా హాజరవుతారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని వాటి కన్నా ముందే గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని కమిషన్ భావించినా.. ప్రకటిత తేదీ నుంచి పరీక్ష రాసేందుకు మూడు నెలల వ్యవధి ఇవ్వాలని మరికొందరు గ్రూప్ 2 అభ్యర్థులు డిమాండ్ చేయసాగారు. వీటన్నింటి నేపథ్యంలో కమిషన్ గ్రూప్ 2 మెయిన్స్‌ను మరోమారు వాయిదా వేసింది.
కాగా గత ప్రభుత్వ హాయంలో గతేడాది డిసెంబర్ 7న గ్రూప్ 2 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రకటన ఇచ్చిన రెండు నెలల వ్యవధిలోనే అంటే ఈ ఏడాది ఫిబ్రవరి 25న ప్రిలిమినరీ పరీక్షను కూడా నిర్వహించింది. ఈ పరీక్షకు 4,83,535 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 4,04,037 మంది పరీక్షకు హాజరయ్యారు. ఏప్రిల్ 10న గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. ఇందులో 92, 250 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. వీరందరికీ తొలుత జులై 28న మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. అయితే ఆ తర్వాత ఆధికారం చేపట్టిన కూటమి సర్కార్ ఇప్పటి వరకూ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష తేదీని రెండు సార్లు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల విన్నపం మేరకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 23వ తేదీన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. కాగా మొత్తం 905 పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే.