ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి కానుగా భారీ శుభవార్త చెప్పింది. ఎటువంటి అధనపు ఛార్జీలు లేకుండానే సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు వెల్లడించింది.
సంక్రాంతి పండగ దృష్ట్యా 7,200 అదనపు బస్సు నడపాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ, కర్ణాటక సహా ఇతర రాష్ట్రాలకు ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున ఆర్టీసీ ఈ చర్యలు తీసుకుంది.
ఆర్టీసీ ఎండీ వెల్లడించిన వివరాల మేరకు.. జనవరి 8 నుంచి 13 వరకు 3,900 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ నుంచి: 2,153 ప్రత్యేక బస్సులు, బెంగళూరు నుంచి: 375 ప్రత్యేక బస్సులు, విజయవాడ నుంచి: 300 ప్రత్యేక బస్సులు నడపనుంది. తిరుగు ప్రయాణం కోసం జనవరి 16 నుంచి 20 వరకు 3,200 ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు.
ప్రత్యేక బస్సుల్లో ఎటువంటి అదనపు ఛార్జీలు ఉండవని ఆర్టీసీ ఎండీ ప్రకటించారు. సాధారణ ఛార్జీలనే వసూలు చేస్తారు. ఒకేసారి రెండు వైపులా టికెట్లు బుక్ చేస్తే 10 శాతం రాయితీ లభిస్తుంది. ప్రత్యేక బస్సుల్లో ప్రయాణానికి ముందస్తు టికెట్ బుకింగ్ సౌకర్యాన్ని అందుబాటులో ఉంచినట్లు ఆర్టీసీ వెల్లడించింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అన్ని ప్రాంతాల్లో సమన్వయం చేస్తూ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని కోరుకుంటున్న ప్రయాణికులు, ఆర్టీసీ బస్సుల ద్వారా సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని ఎంచుకోవాలని సూచించారు. APSRTC Online Booking సౌకర్యాన్ని వినియోగించుకుని ముందుగా టికెట్లు బుక్ చేసుకోవడం ద్వారా పండగ సందడిలో టెన్షన్ లేకుండా సులభంగా ప్రయాణించవచ్చు.