ఎస్పీ కార్యాలయంలో ఏఆర్ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
అన్నమయ్య జిల్లా రాయచోటిలోని ఎస్పీ కార్యాలయం వద్ద ఆదివారం సాయంత్రం విధి నిర్వహణలో ఉన్న ఏఆర్ మహిళా కానిస్టేబుల్ వేదవతి (28) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రధాన ద్వారం వద్ద ఉన్న గార్డు డ్యూటీ గదిలోనే ఆమె తన గన్‌తో కాల్చుకున్నారు. గార్డు గది నుంచి పెద్ద శబ్దం రావడంతో కార్యాలయంలో ఉన్న పోలీసులు, సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.
అప్పటికే వేదవతి మృతి చెందినట్లు గుర్తించారు. వెంటనే ఆమె భర్త దస్తగిరికి సమాచారం అందించడంతో ఆయన అక్కడికి చేరుకున్నారు. రాయచోటి పట్టణ సీఐ సుధాకర్‌రెడ్డి సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె భర్తను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన వేదవతికి మదనపల్లెకు చెందిన దస్తగిరితో ఏడేళ్ల కిందట ప్రేమ వివాహమైంది. వీరికి అయిదేళ్ల కుమార్తె ఉన్నారు.
దస్తగిరికి వేదవతి రెండో భార్య అని పోలీసులు చెబుతున్నారు. మొదటి భార్యకు ఇద్దరు కుమారులున్నారు. విధి నిర్వహణలో ఉన్న సమయంలో వేదవతి సెల్‌ఫోన్‌లో మాట్లాడారని, ఆ సమయంలోనే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కానిస్టేబుల్ వేదవతి ఆత్మహత్యపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ వివరించారు.