శీతాకాలం ప్రారంభమైంది. వాతావరణం కాస్త చల్లగా ఉన్నప్పుడు తోటల్లో చీమల బెడద పెరుగుతుంది. చీమలను ఎలాగైనా ఇంటి నుండి తరిమికొట్టవచ్చు. కానీ అవి మొక్కలకు పడితే మాత్రం వాటిని వదిలించుకోవటం చాలా కష్టం. చీమలు మొక్కల పెరుగుదలతో పాటు వాటి ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాయి. దీంతో చాలా మంది మార్కెట్లో దొరికే రసాయనాలతో చీమల్ని వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. ఈ రసాయనాలు మొక్కకు హాని కలిగిస్తాయి.
గార్డెన్‌లో మొక్కల వేర్లు, కొమ్మలలో చీమలు ఎక్కువగా కనిపిస్తాయి. వీటితో మొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది. మొక్కల మొదల్లో చీమలు గూడులు కట్టుకుంటాయి. దీంతో.. మొక్కకు కావాల్సిన తేమ అందదు. దీంతో.. మొక్క నాశనం అవుతుంది. ఇలా చీమలు మొక్కల దగ్గర ఎక్కువగా కనిపిస్తే కొన్ని ఇంటి చిట్కాలతో వాటిని తరిమికొట్టవచ్చు. వంటింట్లో దొరికే కొన్ని పదార్థాలతో చీమలను సహజంగా వదిలించుకోవచ్చు. వీటి వల్ల మొక్క ఆరోగ్యం కూడా పాడవ్వదు. అంతేకాకుండా మార్కెట్ నుంచి రసాయనాలు కొనాల్సిన పని కూడా ఉండదు.
పచ్చి మిర్చి..
తోటలోని చీమలను తరిమికొట్టేందుకు వంటగదిలో దొరికే పచ్చి మిర్చి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందుకోసం పచ్చి మిరపకాయలను గ్రైండ్ చేసి నీటిలో ఉడకబెట్టాలి. ఇప్పుడు ఈ ద్రావణాన్ని ఫిల్టర్ చేసి చీమలు ఉన్న ప్రదేశంలో పిచికారీ చేయాలి. పచ్చి మిర్చి వాసన, రుచిని చీమలు తట్టుకోలేవు. దీంతో.. మొక్కల నుంచి దూరంగా పారిపోతాయి. ఈ ఘాటైన వాసనకు మొక్కల దరిదాపుల్లోకి కూడా చీమలు రావు.
దోమల్ని తరిమికొట్టే మొక్కలు
వెల్లుల్లి పొట్టు, లవంగాలు..
చాలా మంది వెల్లుల్లి ఒలిచిన తర్వాత పొట్టును చెత్తలో వేస్తారు. అయితే, వెల్లుల్లి పొట్టుతో చీమలకు చెక్ పెట్టవచ్చు. ఇందుకోసం వెల్లుల్లి పొట్టి, లవంగాల్ని తీసుకోండి. ఈ రెండు సహజంగానే క్రిమి సంహారక లక్షణాల్ని కలిగి ఉంటాయి. ఈ చిట్కా కోసం వెల్లుల్లి పొట్టును, లవంగాల్ని నీటిలో బాగా మరగించండి. మరగించిన తర్వాత కాసేపు చల్లారనివ్వండి. ద్రావణం చల్లారిన తర్వాత స్ప్రే బాటిల్‌లోకి తీసుకోండి. ఇప్పుడు మొక్కలపై చీమలు ఉన్న ప్రదేశాల్లో పిచికారీ చేయండి. ఆ తర్వాత చీమలు వెంటనే మొక్కల్ని వదిలి పారిపోతాయి.
దాల్చినచెక్క పొడి..
మొక్కల నుంచి శాశ్వతంగా చీమల్ని వదిలించుకోవడానిగి దాల్చిన చెక్క పొడి చాలా బాగా ఉపయోగపడుతుంది. నిజానికి దాల్చిన చెక్క వాసనను చీమలు తట్టుకోలేవు. అందుకే ఈ చిట్కా బెస్ట్ ఆప్షన్. ఇందుకోసం మీరు దాల్చిన చెక్కను మెత్తగా పొడి చేయండి. ఆ తర్వాత ఈ పొడిని నీటిలో కలపండి. ఈ ద్రావణాన్ని మొక్కల చుట్టూ చల్లుకోండి.
కాఫీ పొడి..
తోటలోని చీమలు మొక్కల్ని నాశనం చేస్తుంటే.. మీరు కాఫీ పొడిని వాడుకోవచ్చు . నిజానికి, కాఫీలో ఉండే కెఫిన్ చీమలను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ ట్రిక్ ప్రయత్నించడానికి.. కాఫీ పొడి నీటిలో వేసి మరగనివ్వండి. ఆ తర్వాత ద్రావణాన్ని చీమలు వచ్చే ప్రదేశంలో స్ప్రే చేయండి. కాఫీ పొడి నీరు వేడిగా ఉండాలి. దీంతో.. చీమలు దెబ్బకి పారిపోతాయి.
పసుపు..
చీమల బారి నుంచి మొక్కల్ని రక్షించుకోవడానికి మీరు పసుపు కూడా వాడుకోవచ్చు. ఇందుకోసం ఒక గిన్నెలో నీళ్లు పోసి.. ఒక చెంచాడు పసుపు మిక్స్ చేయండి. బాగా కలిపిన తర్వాత ఆ మిశ్రమాన్ని మొక్కల మొదల్లో చీమలు గూడులు పెట్టుకున్న ప్రాంతంలో పోయండి. ఇలా రెండు మూడు సార్లు చేయడం వల్ల చీమలు ఆ ప్రాంతం నుంచి దూరంగా వెళ్లిపోవాల్సిందే అంటున్నారు నిపుణులు.
గమనిక..
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం.