గణేష్‌ విగ్రహం పెడుతున్నారా.. ఇవి తెలుసుకోకపోతే చిక్కులు తప్పవు

www.mannamweb.com


తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా పండగల సీజన్‌ ప్రారంభం అయ్యింది. నేడు అనగా ఆగస్టు 26, సోమవారం నాడు కృష్ణాష్టమి పండుగ. ఇది పూర్తైన పది రోజుల్లోనే హిందువులు జరుపుకునే అతి పెద్ద పర్వదినం వినాయక చవితి వస్తుంది. ఇక గణేష్‌ ఉత్సవాలు అంటే గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రతి చోటా ఎంతో ఘనంగా వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు జరుపుతారు. ఊరువాడా.. బొజ్జ గణపయ్య నామ స్మరణతో మార్మోగిపోతుంది. మండపాలు ఏర్పాటు చేసి.. తొమ్మిది రోజుల పాటు నిష్టగా, భక్తి శ్రద్దలతో పూజించి.. ఆ తర్వాత లంబోదరుడిని గంగమ్మ ఒడికి చేరుస్తారు. ఇక ఈ ఏడాది సెప్టెంబర్ 7న వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అదే నెల 17న మహా నిమజ్జన ఉరేగింపు కార్యక్రమాలు ఉంటాయి.

ఒకప్పుడు వినాయక చవితి అంటే ఊరంతా కలిపి ఒక్క విగ్రహం పెట్టేవారు. మరి ఇప్పుడో వీధికో విగ్రహం అన్నట్లు తయారయ్యింది పరిస్థితి. ఇక నగరాల్లో అయితే కాలనీలో 2, 3 చోట్ల గణేష్‌ మండపాలు దర్శనం ఇస్తాయి. అయితే వినాయక మండపాలు ఏర్పాటు చేయాలంటే కచ్చితంగా కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. మండపం ఏర్పాటు చేయాలంటే.. ప్రభుత్వం నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. అలానే మండపాల నిర్వాహకులు నిబంధనలు పాటించాలని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా సహకరించాలని నిర్వాహకులు, ఉత్సవ కమిటీలను సీపీ కోరారు.

మండపాల ఏర్పాటు చేయాలంటే ఇవి ఫాలో అవ్వాలి..

గణేష్ మండపాలు ఏర్పాటు చేసేందుకు ఎంచుకున్న ప్రభుత్వ, ప్రయివేటు స్థల యజమానుల నుంచి ఎలాంటి అభ్యంతరం లేదు అని ధ్రువీకరిస్తూ.. నో అబ్జెక్టన్‌ సర్టిఫికేట్‌ (ఎన్‌ఓసీ) తప్పనిసరిగా తీసుకోవాలి.
వివాదాస్పద ప్రదేశాల్లో వినాయకుడి మండపాలు ఏర్పాటు చేయకూడదు.
మండపాలకు అవసరమైన విద్యుత్తు కనెక్షన్‌ కోసం విద్యుత్తు శాఖ నుంచి అనుమతి తీసుకోవాలి.
సెల్లార్లు, కాంప్లెక్స్‌ల్లో విగ్రహాల ఊరేగింపులకు పోలీసుల అనుమతి కచ్చితంగా తీసుకోవాలి.
సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం రాత్రి 10 నుంచి మరుసటిరోజు ఉదయం 6 గంటల వరకు మండపాల వద్ద లౌడ్‌స్పీకర్ల నిషేధం ఉంటుంది.
వినాయక మండపాల వద్ద వాలంటీర్లు కార్డులు/బ్యాడ్జీలు ధరించాల్సి ఉంటుంది.
అగ్ని ప్రమాదాల బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యలుగా మండపాల్లోఅగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేసుకోవాలి.
ఇక విగ్రహాలు ఊరేగింపుగా వెళ్లే మార్గం, సమయం వివరాలను ముందుగానే పోలీసులకు అందజేయాలి.
మండపాల ఏర్పాటుకు సబంధించిన పత్రాలను జత చేసి రేపటి నుంచి (ఆగస్టు 27) సెప్టెంబర్ 6వ తేదీ లోపు పోలీసుల వెబ్‌సైట్‌లో అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది.
ఆ తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్, ఏసీపీ ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించి అనుమతి మంజూరు చేస్తారు.
దీనిపై ఇంకా ఏవైనా సందేహాలుంటే సంబంధిత పోలీస్‌స్టేషన్, లేదా 8712665785 నెంబర్‌ను సంప్రదించాలి.