బియ్యంలో పురుగులు పట్టడం ఇప్పుడు చింతకు కారణం కాదు! రూపాయి ఖర్చు లేకుండా వేప ఆకులు, వెల్లుల్లి, మిరియాలు వంటి సులభ దేశీ చిట్కాలతో బియ్యాన్ని నెలల తరబడి తాజా, సువాసనగా ఉంచే సూపర్ మార్గాలు తెలుసుకోండి.
ప్రతి ఇంట్లోనూ తప్పనిసరిగా బియ్యం ఉంటాయి. భోజనంలో ప్రధాన భాగం కావడంతో నెలలకు సరిపడ బియ్యాన్ని తెచ్చి నిల్వ ఉంచుకుంటారు. కానీ చాలా మంది ఎదుర్కొనే సాధారణ సమస్య ఏమిటంటే.. కొన్ని రోజులు గడిచిన వెంటనే బియ్యంలో చిన్న చిన్న పురుగులు పట్టడం. ఇవి బియ్యం రుచి, వాసన, నాణ్యతను పూర్తిగా పాడు చేస్తాయి. వంట చేయడానికి కూడా వీలుకాకుండా చేస్తాయి. చాలామంది ఇది చెడ్డ స్టోరేజ్ వల్ల అని అనుకుంటారు కానీ వాస్తవానికి కారణాలు అంత సింపుల్ కావు. వాతావరణం, తేమ, నిల్వ విధానం ఇవన్నీ కలిసి పురుగుల పెరుగుదలకు దారి తీస్తాయి.
బియ్యంలో దాగి ఉండే పురుగు గుడ్లు తేమ ఉన్నప్పుడు చురుకుగా మారతాయి. ముఖ్యంగా ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఈ గుడ్లు పుట్టి పురుగులుగా మారి మొత్తం బియ్యం వ్యాపిస్తాయి. మీరు ఆ బియ్యాన్ని కొత్త బియ్యంలో కలిపితే కొత్తదాన్ని కూడా పాడు చేస్తాయి. వేసవి కాలంలో, వర్షాకాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు బియ్యాన్ని సరిగా నిల్వ చేయకపోతే కేవలం రెండు వారాల్లోనే పురుగులు పట్టే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. పూర్వీకులు ఈ సమస్యకు చాలా చక్కటి దేశీ పరిష్కారాలు చెప్పారు. ఇవి రసాయనాల్లేని సహజ పద్ధతులు. వాటిని పాటిస్తే బియ్యం నెలల తరబడి తాజాగా, సువాసనగా, రుచిగా ఉంటుంది. మొదటగా చెప్పుకోవాల్సింది వేప ఆకులు. వేప ఆకుల్లో సహజ క్రిమిసంహారక గుణాలు ఉన్నాయి. ఎండిన వేప ఆకులను బియ్యం పెట్టెలో వేసేస్తే పురుగులు దగ్గర కూడా రావంట. వేప వాసన పురుగులను దూరంగా ఉంచుతుంది.
రెండో చిట్కా వెల్లుల్లి రెబ్బలు. ప్రతి ఐదు కిలోల బియ్యానికి నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రెబ్బలు వేస్తే వెల్లుల్లి వాసన పురుగులను పారదోలుతుంది. బియ్యం సువాసన కూడా అలాగే ఉంటుంది. బియ్యంలో పురుగులు తరమడానికి బే ఆకులు (తేజపత్రి) కూడా చాలా ప్రభావవంతమైనవి. ఇవి సహజంగా కీటకాలను దూరంగా ఉంచి బియ్యం తాజాగా ఉండేలా చేస్తాయి. మిరియాలు గింజలు వేసినా బియ్యం ఎక్కువసేపు పాడవదు. నాలుగు నుండి ఐదు మిరియాల గింజలను బియ్యం పెట్టెలో వేస్తే పురుగులు పెరగవని నిపుణులు చెబుతున్నారు.
అంతేకాకుండా నెలకు ఒకసారి బియ్యాన్ని ఎండలో ఎండబెట్టడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ఇది బియ్యంలో తేమను తొలగించి పురుగుల ఉద్భవాన్ని అడ్డుకుంటుందంట. వేసవి సూర్యరశ్మిలో కొన్ని గంటలు బియ్యాన్ని ఉంచడం వల్ల అవి మరింత తాజాగా ఉంటాయి.
అన్నిటి కంటే ముఖ్యంగా బియ్యం నిల్వ చేసేప్పుడు అది పూర్తిగా పొడిగా ఉందో లేదో చూసుకోవాలి. కొత్త బియ్యాన్ని తెచ్చిన వెంటనే మూసిన డబ్బాలో వేసేయకుండా, ఒక రోజు గాలి తగిలే ప్రదేశంలో ఉంచి తరువాతే నిల్వ చేయాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే బియ్యం నిల్వ చేసే ప్రదేశం శుభ్రంగా, పొడిగా ఉండేలా చూసుకోవాలి. పాత బియ్యం మిగిలి ఉంటే దానిని పూర్తిగా తీసేసి శుభ్రపరిచి కొత్త బియ్యం వేసుకోవాలని బీహార్ కి చెందిన నిపుణులు చెబుతున్నారు.
ఈ చిన్నచిన్న దేశీ చిట్కాలు పాటిస్తే మీ బియ్యంలో పురుగులు పట్టే సమస్యనే రాదు. ముఖ్యంగా వేప ఆకులు, వెల్లుల్లి, మిరియాలు వంటి పదార్థాలు సహజమైనవి, ఆరోగ్యానికి హానికరం కావు. ఇది మన అమ్మమ్మలు, నాయనమ్మలు ఉపయోగించిన పద్ధతి.. అందుకే ఇవి కాలాన్ని జయించి ఇప్పటికీ సూపర్‌గా పనిచేస్తున్నాయి.కాబట్టి ఇకపై బియ్యంలో పురుగులు పట్టినా బాధపడకండి. ఈ చిట్కాలను పాటించి మీ బియ్యాన్ని నెలల తరబడి తాజాగా, సువాసనగా, రుచిగా ఉంచుకోండి. రసాయనాలు లేకుండా సహజంగా సమస్యకు చెక్ పెట్టండి.
































