Heart: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.?

మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో గుండె ఒకటి. గుండె కొట్టుకున్నంత కాలమే జీవితం కొనసాగుతుందని తెలిసిందే. ఒకప్పుడు వయసు మళ్లిన తర్వాతే గుండెపోటు సమస్యలు వస్తాయని అనుకుంటాం.


అయితే మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా గుండె సంబంధిత సమస్యల బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. చెడు జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, తక్కువ శారీరక శ్రమ తగ్గడం వంటివి చిన్న వయసులోనే గుండె బలహీనంగా మారడానికి కారణమవుతున్నాయి. అయితే గుండె బలహీనపడిందన్న విషయాన్ని కొన్ని లక్షణాల ద్వారా ముందుగానే గుర్తించవచ్చు. ఇంతకీ ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* చిన్న చిన్న పనులకే ఆలసిపోవడం, మెట్టు ఎక్కితే ఆయాసం రావడం, ఊపిరి ఆడకపోవడం వంటివన్నీ గుండె బలహీనతకు సంకేతంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు.

* గుండె బలహీనత కారణంగా, శరీరానికి తగినంత ఆక్సిజన్ అందదు, ఇది శ్వాస ఆడకపోవడానికి దారితీస్తుంది. కొన్నిసార్లు తేలికపాటి శారీరక శ్రమ చేసినప్పటికీ, ఛాతీలో ఒత్తిడి లేదా భారంగా అనిపిస్తుంది.

* గుండె బలహీనపడినప్పుడు, శరీరంలో రక్త ప్రసరణ ప్రభావితమవుతుంది, దీని వల్ల పాదాలు, చీలమండలు, కడుపులో కూడా వాపు వస్తుంది.

* తరచుగా తల తిరుగుతున్నట్లు లేదా బలహీనంగా అనిపిస్తే, అది రక్తపోటు సమస్య వల్ల కావచ్చు, ఇది గుండె బలహీనతకు సంకేతంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు.

* శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటే లేదా బిగ్గరగా గురక పెడితే, అది గుండె సమస్యను సూచిస్తుంది. ఈ సమస్య కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి సంబంధిత పరీక్షలను చేయించుకోవడం ఉత్తమం.

* మీ గుండె చాలా వేగంగా, చాలా నెమ్మదిగా లేదా సక్రమంగా కొట్టుకుంటే (అరిథ్మియా), అది గుండె బలహీనతకు సంకేతం కావచ్చు. అటువంటి స్థితిలో వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

గుండె ఎందుకు బలహీనపడుతుంది?

అధిక రక్తపోటు, డయాబెటిస్, చెడు జీవనశైలి, అధిక జంక్ ఫుడ్, మద్యం, ధూమపానం మరియు వ్యాయామం లేకపోవడం, ఒత్తిడి, ఆందోళన కొలెస్ట్రాల్‌ పెరగడం వంటివి గుండె బలహీనపడడానికి సంకేతంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు.

గుండె ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి.?

రోజూ కనీసం 30 నిమిషాలు వాకింగ్‌ లేదా యోగా వంటివి అలవాటు చేసుకోవాలి. తీసుకునే ఆహారంలో ఎక్కువ ఫైబర్, ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండేలా చూసుకోవాలి. స్మోకింగ్‌, డ్రింకింగ్‌ వంటివి అలవాటు చేసుకోవాలి. ఒత్తిడిని తగ్గించుకోండి, ధ్యానం చేయండి. మీ రక్తపోటు, కొలెస్ట్రాల్, చక్కెర స్థాయిలను ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకుంటూ ఉండాలి.