అవి ఖర్జూర పండ్లా.. బంగారు పండ్లా?

తాజాగా దేశ రాజ‌ధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంత‌ర్జాతీయ‌ విమానాశ్రయంలో బంగారాన్ని అక్రమంగా త‌ర‌లిస్తున్న ఓ వ్యక్తిని క‌స్టమ్స్ అధికారులు ప‌ట్టుకున్నారు. అత‌ని వ‌ద్ద నుంచి సుమారు 172 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ప్రకారం.. ఎస్వీ-756 విమానంలో జెడ్డా నుంచి ఢిల్లీకి వ‌చ్చిన 56 ఏళ్ల వ‌య‌సున్న ఒక ప్రయాణికుడిపై అనుమానంతో క‌స్టమ్స్‌ అధికారులు త‌నిఖీ చేశారు. బ్యాగేజీ చెకింగ్ స‌మ‌యంలో అత‌ని ల‌గేజీపై వారికి అనుమానం వ‌చ్చింది. అత‌ని వ‌ద్ద ఉన్న ఖ‌ర్జూర పండ్ల మూట‌ను ఓపెన్ చేసి ప‌రిశీలించారు. ఆ పండ్లలో గింజల ప్లేస్‌లో బంగారు ముక్కల‌ను అమ‌ర్చిన‌ట్లు గుర్తించారు. ఆ ఖ‌ర్జూర పండ్ల బ్యాగ్‌లో ఒక బంగారు చైన్ ను కూడా అధికారులు గుర్తించారు. ఖ‌ర్జూర పండ్లలో దాచిన ఆ బంగారం మొత్తం 172 గ్రాములు ఉన్నట్లు అధికారులు తెలిపారు. స‌ద‌రు వ్యక్తిపై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేపట్టారు.


👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.