నేటి ఉరుకుల పరుగుల జీవితంలో రోజంతా బయటే గడపవల్సి ఉంటుంది. దీంతో ఇంట్లో మొబైల్‌కు ఛార్జింగ్ పెట్టని వారు బయట తిరిగేటప్పుడు తమ ఫోన్ బ్యాటరీ అయిపోవడం వంటి సమస్యలను ఎదుర్కుంటూ ఉంటారు.
ఇలాంటి పరిస్థితిలో పబ్లిక్ ప్లేస్‌లలో ఛార్జింగ్ పాయింట్ కోసం చూస్తాం. కానీ అలాంటి ప్రదేశంలో మీ ఫోన్‌ను ఛార్జ్ చేయడం వల్ల మీ ఫోన్ లోని వ్యక్తిగత సమాచారం ప్రమాదంలో పడుతుందని మీకు తెలుసా? సైబర్ భద్రతా నిపుణుల అభిప్రాయం ప్రకారం బహిరంగ ప్రదేశంలో ఛార్జింగ్ పాయింట్‌ను ఉపయోగించడం వల్ల మీ వ్యక్తిగత సమాచారం దొంగిలించబడుతుందట. ఇలాంటి ప్రదేశాల్లో మాల్వేర్‌ను సులువుగా ఇన్‌స్టాల్ చేయవచ్చు. పబ్లిక్ USB పోర్ట్‌ను ఎక్కడెక్కడ వాడకూడదో ఇక్కడ తెలుసుకుందాం..
HGD ఇండియా నివేదిక ప్రకారం.. ఎయిర్‌పోర్ట్‌లలో ఛార్జింగ్ పాయింట్లు ప్రతిచోటా ఉంటాయి. ప్రయాణ సమయంలో మీ ఫోన్ బ్యాటరీ తక్కువగా ఉన్నప్పుడు వీటిని ఉపయోగించడం సులభం అవుతుంది. కానీ సైబర్ సెక్యూరిటీ నిపుణుడు జాసన్ గ్లాస్‌బర్గ్ ప్రకారం ప్రజలు అలాంటి ప్రదేశాలలో ఛార్జ్ చేయకూడదు. మీరు విమానాశ్రయంలో ఛార్జింగ్ పాయింట్‌ను ఉపయోగిస్తే, హ్యాకర్లు మీ ఫోన్ నుండి డేటాను దొంగిలించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే రైల్వే స్టేషన్ లేదా బస్ టెర్మినల్‌లలో కూడా ఉచిత ఛార్జింగ్ స్టేషన్‌ను చూసి వెంటనే ఫోన్ ఛార్జ్ చేయకూడదు. హ్యాకర్లు మీ ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి ఈ స్టేషన్లలో USB పోర్ట్‌ను ఏర్పాటు చేస్తారు. అంతేకాకుండా వారు మీ డేటాను కూడా దొంగిలించవచ్చు. మీ కాంటాక్ట్ లిస్ట్, సందేశాలు, ఫోటోలు అన్నీ హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోతాయి.
హోటల్ గదుల్లో USB పోర్ట్‌లు ఉంటాయి. వీటిని కూడా హ్యాకర్లు హ్యాక్ చేయవచ్చు. మీ ఫోన్‌ను దానికి ప్లగ్ చేస్తే, తద్వారా మీ ఫోన్‌కు మాల్వేర్‌ను సోకవచ్చు. అలాగే అద్దె కార్లు కూడా USB పోర్ట్‌లతో ఉంటాయి. ఇవి ఛార్జింగ్‌కు అనుకూలంగా అనిపించవచ్చు. అయితే ఈ పోర్ట్‌లను ఉపయోగించడం ప్రమాదకరమని సైబర్ సెక్యూరిటీ కన్సల్టెంట్ స్టేసీ క్లెమెంట్స్ అంటున్నారు. హ్యాకర్లు ఈ పోర్ట్‌ల ద్వారా మీ ఫోన్ నుంచి సమాచారాన్ని దొంగిలించవచ్చు. అంతేకాకుండా మీ ఫోన్‌ను కారులో ఛార్జ్ చేయడం వల్ల బ్యాటరీ దెబ్బతింటుంది.
మాల్స్‌లో షాపింగ్ చేసేటప్పుడు మీ ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్లను ఉపయోగించడం ప్రమాదకరం. ఇవి మీ ఫోన్ నుండి కాంటాక్ట్‌లు, ఇమెయిల్‌లు, సందేశాలు, ఫోటోలు, పాస్‌వర్డ్‌లు, బ్యాంక్ వివరాలను కూడా దొంగిలించగలవు. కొన్ని సందర్భాల్లో మాల్వేర్ ప్రమాదం కూడా ఉంది. ఇక కాఫీ షాపుల్లో కూడా ఫోన్ ఛార్జింగ్ సౌకర్యాలు ఉన్నాయి. హ్యాకర్లు ఇక్కడ కూడా USB పోర్ట్‌లలో దాచిన పరికరాలను ఇన్‌స్టాల్ చేయవచ్చు. ఈ పరికరాలు మీ ఫోన్‌లోకి మాల్వేర్‌ను ఇంజెక్ట్ చేయగలవు. అది మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించవచ్చు. కాబట్టి బహిరంగ ప్రదేశాల్లో మీ ఫోన్‌ను ఛార్జ్ చేయకుండా ఉండటమే మంచిది. ఇంటి నుండి బయలుదేరే ముందు మీ ఫోన్‌ను సరిగ్గా ఛార్జ్ చేసి ఉందో, లేదో సరిచూసుకుంటే ఏ ప్రమాదం ఉండదు.
































