దేశంలోని చాలా మందికి ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ లాంటి నగరాల్లో సొంత ఇల్లు కొనడం చాలా మందికి ఒక కల. కలను సహకారం చేసుకునేందుకు పెరుగుతున్న ఇళ్ల ధరల కారణంగా చాలా మంది హోం లోన్‌లపై ఆధారపడాల్సి వస్తోంది.
అందుకే తక్కువ వడ్డీతో హోం లోన్ ఎక్కడ దొరుకుతుంది? ఏ బ్యాంక్‌లో ఈఎంఐ తక్కువగా ఉంటుంది? అనే ప్రశ్నల గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. వీటికి సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం.. వాస్తవానికి.. గతేడాది రిజర్వ్ బ్యాంక్ రిపో రేటును గణనీయంగా తగ్గించిన తర్వాత, ప్రభుత్వ రంగ బ్యాంకులు హోం లోన్ వడ్డీ రేట్లను బాగా తగ్గించాయి. ప్రస్తుతం కొన్ని పీఎస్‌యూ బ్యాంకులు 7.10 శాతం నుంచే హోం లోన్‌లు ఇస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా హోం లోన్‌ను 7.10 శాతం ప్రారంభ వడ్డీతో అందిస్తోంది. 30 లక్షల నుంచి 75 లక్షల రూపాయల వరకు లోన్ తీసుకుంటే వడ్డీ 7.10 నుంచి 10 శాతం వరకు ఉంటుంది. 75 లక్షలకుపైగా లోన్ అయితే వడ్డీ 7.10 నుంచి 10.25 శాతం వరకు ఉంటుంది.
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కూడా 7.10 శాతం వడ్డీతో హోం లోన్ ఇస్తోంది. 30 లక్షల నుంచి 75 లక్షలకుపైగా లోన్‌లకు 7.10 నుంచి 9.15 శాతం వరకు వడ్డీ వర్తిస్తుంది. లోన్ మొత్తం ఎంతైనా ప్రారంభ వడ్డీ తక్కువగానే ఉండటం ఈ బ్యాంక్ ప్రత్యేకత. యూకో బ్యాంక్‌లో 30 లక్షల నుంచి 75 లక్షలకుపైగా హోం లోన్‌లకు 7.15 నుంచి 9.25 శాతం వరకు వడ్డీ ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో అయితే అన్ని కేటగిరీల హోం లోన్‌లకు 7.10 శాతం నుంచి ప్రారంభమై గరిష్టంగా 9.90 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నారు. ఇక ప్రైవేట్ బ్యాంకుల విషయానికి వస్తే, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ హోం లోన్ వడ్డీ 7.90 శాతం నుంచి ప్రారంభమవుతుంది. ఐసీఐసీఐ బ్యాంక్‌లో 7.65 శాతం నుంచి హోం లోన్ లభిస్తుంది. యాక్సిస్ బ్యాంక్‌లో మాత్రం వడ్డీ కొంచెం ఎక్కువగా ఉండి సుమారు 8.35 శాతం నుంచి ప్రారంభమవుతుంది. మొత్తంగా చూస్తే, ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో హోం లోన్ వడ్డీ ప్రైవేట్ బ్యాంకులతో పోలిస్తే తక్కువగా ఉంది. తక్కువ ఈఎంఐతో దీర్ఘకాలానికి ఇల్లు కొనాలనుకునేవారికి పీఎస్‌యూ బ్యాంకులు మంచి ఆప్షన్‌గా మారుతున్నాయి.


































