దీపావళికి స్పీట్స్ కొంటున్నారా.. నకిలీ స్పీట్స్ ని గుర్తించే సింపుల్ చిట్కాలు ఇవే

దీపావళి సందర్భంగా మార్కెట్‌లో కల్తీ స్వీట్స్, నెయ్యి, కోవా, వెండి రేకులు, పాలు ఎక్కువగా ఉంటాయి. చిన్న చిట్కాలతో అసలైనవి గుర్తించి ఆరోగ్యంగా పండుగను జరుపుకోవచ్చు.


దీపావళి సమీపిస్తుండటంతో స్వీట్ల డిమాండ్ ఊహించని స్థాయిలో పెరిగింది. ఇళ్లలో దీపాలు వెలిగిస్తూ, తీపి వంటకాలతో కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఆనందాన్ని పంచుకోవడమే ఈ పండుగ ప్రత్యేకత. కానీ ఈ సంతోషకర వేడుకల మధ్య ఒక పెద్ద ప్రమాదం దాగి ఉంటుంది.

అదే మార్కెట్‌లో కల్తీ స్వీట్స్.. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందాలని కొందరు వ్యాపారులు నకిలీ పదార్థాలతో తీపి వంటకాలు తయారు చేస్తున్నారు. ఇవి రుచి బాగానే ఉన్నా, ఆరోగ్యానికి మాత్రం ఘోరమైన ముప్పు. అయితే భయపడాల్సిన పనిలేదు. ఇంట్లోనే సులభంగా అసలైనవి.. నకిలీవి గుర్తించే చిట్కాలు ఉన్నాయి. వాటిని తెలుసుకుంటే మీరు సురక్షితంగా పండుగను ఆస్వాదించవచ్చు.

దీపావళి సమయంలో కుంకుమపువ్వు పెడాకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అసలు కుంకుమపువ్వు చాలా ఖరీదైనది కావడంతో చాలామంది వ్యాపారులు కృత్రిమ రంగులతో నకిలీ తీపి వంటకాలను తయారు చేస్తారు. దీన్ని గుర్తించాలంటే ఒక గ్లాసు నీటిలో కొద్దిగా కుంకుమపువ్వు వేసి చూడండి. వెంటనే నీరు పసుపు లేదా నారింజ రంగులోకి మారితే అది నకిలీదే. నిజమైన కుంకుమపువ్వు క్రమంగా రంగు విడుస్తూ అసలు సువాసనను ఇస్తుంది.

కోవా కూడా మరో పెద్ద కల్తీ ఉత్పత్తి. దీన్ని పరీక్షించడానికి కొన్ని చుక్కల అయోడిన్ వేసి చూడండి. రంగు ముదురుతుంటే అది నకిలీ కోవా అని అర్థం. అసలు కోవ రబ్బరు వలె లాగబడదు, అది మృదువుగా ఉంటుంది. ఇక నెయ్యిలో కూడా చాలామంది డాల్డా లేదా నూనె కలుపుతుంటారు. దీన్ని గుర్తించడానికి కొద్దిగా నెయ్యి తీసుకొని ఫ్రిజ్‌లో ఒక గంట ఉంచండి. రెండు పొరలుగా విడిపోయితే అది కల్తీ. అసలు నెయ్యి చల్లబడిన తర్వాత ఒక్కటే గట్టి పొరగా మారుతుంది.

దీపావళి స్వీట్లలో తరచుగా వెండి రేకులు వాడుతారు. కానీ కొన్ని దుకాణాలు అల్యూమినియం లేదా ఇతర లోహాలతో నకిలీ రేకులు తయారు చేస్తాయి. వాటిని గుర్తించాలంటే ఆ రేకును నీటిలో ముంచి వేళ్లతో సున్నితంగా రుద్దండి. పగుళ్లు వస్తే లేదా వేళ్లకు అతుక్కుంటే అది నకిలీదే. అసలు వెండి రేకు పగుళ్లు ఇవ్వదు, మరకలు పడవు.

కేవలం స్వీట్లు మాత్రమే కాదు పాలలో కూడా కల్తీ ఎక్కువగా ఉంటుంది. వేడి నీటిలో పాలను కలపగానే ఎక్కువ నురుగు రావడం, కొవ్వు పొర కనిపించడం కృత్రిమ పాలను సూచిస్తుంది. అంతేకాదు, ఉడకబెట్టినప్పుడు బలమైన దుర్వాసన వస్తే అది కల్తీ పాలు అని అర్థం చేసుకోవచ్చు.

దీపావళి పండుగలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కొంచెం అప్రమత్తంగా ఉండటం చాలును. చిన్న చిన్న చిట్కాలు పాటించడం ద్వారా కుటుంబ సభ్యులను హానికరమైన కల్తీ పదార్థాల నుంచి దూరంగా ఉంచవచ్చు. పండుగ రుచిని ఆనందంగా ఆస్వాదించవచ్చు.

(గమనిక: ఈ సమాచారం ఆరోగ్య నిపుణులు అందించిన సాధారణ సమాచారం ఆధారంగా రాసినది. ఇది సాధారణ సమాచారం మాత్రమే. ఏ చర్యలు తీసుకునే ముందు తప్పనిసరిగా మీ వైద్యుడిని సంప్రదించండి.)

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.