ప్రస్తుత రోజుల్లో అనేక మంది నాన్-స్టిక్ పాత్రలను అధికంగా ఉపయోగిస్తున్నారు. కానీ నాన్-స్టిక్ పాత్రల్లో వంట చేయడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
దీర్ఘకాలంగా నాన్-స్టిక్ పాత్రలు వాడడం శరీరానికి హానికరం అని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలనుకునే వారు మట్టి పాత్రలు, ఐరన్ పాత్రలు వంటివాటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కానీ ఐరన్ పాత్రలు వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా కొన్ని రకాల ఆహారాలను ఐరన్ పాత్రల్లో వండకూడదు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
గుడ్లు ఐరన్ పాత్రల్లో వండినప్పుడు అవి పాత్రకు అతుక్కుపోతాయి. ఇది శుభ్రం చేయడానికి కష్టం అవ్వటమే కాకుండా వంటకం తినడానికి కూడా ఇబ్బంది కలిగించవచ్చు. కాబట్టి గుడ్లను ఐరన్ పాత్రల్లో వండకూడదు.
టమాటా సహజంగా ఆమ్లతత్వం ఎక్కువగా కలిగి ఉంటుంది. ఐరన్ పాత్రల్లో ఎక్కువగా టమాటా వండితే ఇది ఐరన్‌తో ప్రతిచర్యకి లోనై ఆహారం రుచి మారిపోవచ్చు. అంతేకాదు కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అధిక ఐరన్ శాతం శరీరంలో నిల్వ ఉండి ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
పన్నీర్, పెరుగు, ఇతర పాల ఉత్పత్తులను ఐరన్ పాత్రల్లో వండకూడదు. ఇవి ఐరన్‌తో కలిసినప్పుడు రుచి పూర్తిగా మారిపోతుంది. అంతేకాదు పాల ఉత్పత్తులు ఐరన్ పాత్రల్లో వండినప్పుడు అవి రంగు మారి చూడడానికి బాగుండవు.
చేపలు చాలా మెత్తగా ఉండటం వల్ల ఐరన్ పాత్రల్లో వండినప్పుడు అవి విరిగిపోవచ్చు. అలాగే ఐరన్ పాత్రలు వేడెక్కినప్పుడు చేపలలోని ప్రొటీన్ మార్పులకు లోనై వాటి రుచి, ఆకృతిని మార్చివేయవచ్చు.