మీ బ్యాంక్‌ అకౌంట్‌లో ఎడాపెడా డబ్బులు జమ చేస్తూ, విత్‌డ్రా చేస్తూ ఉన్నారా?

www.mannamweb.com


మీరు మీ బ్యాంక్‌ అకౌంట్‌లో ఎడాపెడా డబ్బులు జమ చేస్తూ విత్‌డ్రా చేస్తూ ఉన్నారా? మీ ట్రాన్సాక్షన్స్‌కి అంతే లేదా? అయితే మీరు చిక్కుల్లో పడ్డట్లే. పరిమితి దాటితే మీరు ప్రతి రూపాయికీ లెక్కచెప్పాల్సిందే. ఎన్నికల నేపథ్యంలో బ్యాంక్ లావాదేవీలపై ఎలక్షన్ కమిషన్ నిఘా పెట్టింది. ఎక్కువ మొత్తంలో జరుగుతున్న లావాదేవీలపై ప్రత్యేక టీంతో ఈసీ దృష్టి సారించింది.

ఎన్నికల వేళ ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈనెల 1 నుంచి ఎన్నికల సంఘం విధించిన మార్గదర్శకాలు గుబులు పుట్టిస్తున్నాయి. కొత్త ఆర్థిక ఏడాది నేపథ్యంలో నగదు, బ్యాంకు డిపాజిట్లపై ఆర్బీఐ కీలక సూచనలు చేసింది. సరికొత్త నిబంధనలను ఆర్బీఐ అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పటికే లోక్‌సభ ఎన్నికల కోడ్ కారణంగా రాష్ట్రంలో వివాహాలు, ఆస్పత్రి ఖర్చులకు కూడా నగదు విషయంలో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

తెలంగాణలో డబ్బు ప్రభావం ఎక్కువ?
ఎన్నికల నేపథ్యంలో ఈసీ నిబంధనలు పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పార్టీలు, నాయకులు డబ్బు పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయి. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో డబ్బు ప్రభావం ఎక్కువని ఈసీ అనుమానిస్తోంది. దీంతో బ్యాంకుల్లో అనుమానాస్పదంగా సాగే ఆర్థిక లావాదేవీలపై నిఘా పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ రెండు నెలల్లో లక్ష రూపాయల పైచిలుకు డిపాజిట్, విత్ డ్రా చేసిన అకౌంట్స్, ఒకే జిల్లాలో పలువురికి ఆన్‌లైన్‌లో నగదు బదిలీ చేసిన ఖాతాల వివరాలను సేకరించాలని ఈసీ కోరింది.

బ్యాంక్‌ల్లో లక్షకు మించి డిపాజిట్ చేసిన అభ్యర్థి, ఆ అభ్యర్థి కుటుంబ సభ్యులు, పార్టీల ఖాతాల వివరాలను సేకరించాలని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. 10 లక్షలు డిపాజిట్ చేసిన ఖాతాల వివరాలను ఆదాయం పన్ను విభాగం అధికారులకు అందజేయాలని సూచించింది. జిల్లా ఎన్నికల అధికారులు అన్ని బ్యాంకుల నుంచి సమాచారం తెప్పించుకోవాలని, ఆ డేటాలో అనుమానాస్పదమైన లావాదేవీలు ఉంటే వాటి వివరాలను ఫ్లయింగ్ స్క్వాడ్‌లకు ఇవ్వాలని పేర్కొంది.

ఐటీ శాఖ నిఘా
మరోవైపు బ్యాంకు ఖాతాల్లో అకస్మాత్తుగా అత్యధిక మొత్తంలో నగదు జమ, నగదు విత్ డ్రాలపై ఐటీ శాఖ నిఘా పెంచింది. ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువగా నగదును సీజ్ చేశారు. ఇప్పుడు జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో కూడా డబ్బు పంపిణీని అరికట్టేందుకు ఈసీ రంగంలోకి దిగింది.

అయితే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోలీసుల అత్యుత్సాహంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిపై వ్యతిరేకత రావడంతో కొంతమేరకు స్పీడును తగ్గించారు. మరి ఇప్పుడు ఈసారి ఎన్నికల్లో డబ్బు, మద్యం సీజ్ చేసేందుకు ఈసీ ఎలాంటి దూకుడుతో వ్యవహరిస్తుందో చూడాలి.