పాలు తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మనందరికీ తెలుసు. అందుకే చిన్న పిల్లల నుంచి ముసలివారి వరకు ప్రతిరోజూ ఒక గ్లాసు పాలు తాగడానికి ఆసక్తి చూపిస్తారు.
పాలలో ఉండే కాల్షియం ఎముకలను, పళ్లను దృఢంగా ఉంచుతుంది. అయితే, అందరికీ పాలు అమృతం కాకపోవచ్చు. ముఖ్యంగా రాత్రిపూట పాలు తాగే అలవాటు ఉన్నవారు కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే, ఆ అలవాటే వారి ప్రాణాల మీదకు తెచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ రోజుల్లో ఊబకాయం లేదా అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారింది. మీరు బరువు తగ్గాలని తీవ్రంగా ప్రయత్నిస్తుంటే, రాత్రి పడుకునే ముందు పాలు తాగడం మానుకోవాలి. పాలలో ఉండే కొవ్వు పదార్థాలు, క్యాలరీలు రాత్రిపూట శరీరంలో త్వరగా పేరుకుపోతాయి. దీనివల్ల బరువు తగ్గడం పక్కన పెడితే, శరీర బరువు మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి, ఇప్పటికే లావుగా ఉన్నవారు రాత్రిపూట పాలకు దూరంగా ఉండటమే శ్రేయస్కరం.
డయాబెటిస్ (టైప్ 2 మధుమేహాం) ఉన్నవారు రాత్రిపూట పాలు తాగే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పాలలో ఉండే లాక్టోస్ శరీరంలో చక్కెర స్థాయిలను అకస్మాత్తుగా పెంచుతుంది. ఇది షుగర్ లెవల్స్ కంట్రోల్ తప్పేలా చేస్తుంది. అలాగే సైనస్, జలుబు లేదా దగ్గుతో బాధపడేవారు రాత్రి పాలు తాగితే అది శరీరంలో శ్లేష్మం ఉత్పత్తిని పెంచుతుంది. దీనివల్ల శ్వాస తీసుకోవడం కష్టంగా మారడమే కాకుండా, తెల్లవారేసరికి జలుబు సమస్య మరింత తీవ్రమవుతుంది.
చాలామంది పాలు తాగితే నిద్ర బాగా పడుతుందని భావిస్తారు. కానీ గ్యాస్, అసిడిటీ లేదా అజీర్తి వంటి సమస్యలతో బాధపడేవారికి రాత్రిపూట పాలు తాగడం శాపంగా మారుతుంది. పాలు అరగడానికి సమయం పడుతుంది, దీనివల్ల కడుపు ఉబ్బరం పెరిగి రాత్రంతా అసౌకర్యంగా అనిపిస్తుంది. మీకు పాలు తాగినప్పుడు అలర్జీ (లాక్టోస్ ఇంటాలరెన్స్) లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆ అలవాటును మానుకోవాలి. పాలు తాగే ముందు మీ శరీర తత్వాన్ని బట్టి వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం.



































