విదేశాలకు వెళుతున్నారా..? ఆ కార్డు తీసుకెళ్లకపోతే ఇక అంతే.

www.mannamweb.com


అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం సాధించిన తర్వాత యూఎస్‌ డాలర్‌ విలువ పెరుగుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో రూపాయి మరింత క్షీణించే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఫారెక్స్‌ కార్డు అంటే విదేశీ కరెన్సీలో మన డబ్బులను నిల్వ చేసే ప్రీ పెయిడ్‌ కార్డు. దీన్ని రిటైల్‌ అవుట్‌ లెట్‌, రెస్టారెంట్లలో చెల్లింపులు, బస్‌ టిక్కెట్ల కొనుగోలుతో పాటు డెబిట్‌, క్రెడిట్‌ కార్డు మాదిరిగా ఉపయోగించుకోవచ్చు. వీసా, మాస్టర్‌ కార్డు నెట్‌ వర్కులనే చాలా వరకూ ఫారెక్స్‌ కార్డులు ఉపయోగిస్తాయి. కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా ఫారెక్స్‌ కార్డు ను వినియోగించే అవకాశం ఉంది. వీటి వల్ల కలిగే ఉపయోగాలను తెలుసుకుందాం.

ఫారెక్స్‌ కార్డులో డబ్బులను జమ చేసినప్పుడు ఆ సమయంలో ఉన్న రూపాయి విలువ ప్రకారం నిర్ధారణ చేస్తారు. అంటే ఆ సమయంలో మారకం రేటును లాక్‌ చేస్తారు. ఆ తర్వాత రూపాయి విలువ తగ్గినా మీకు ఇబ్బంది ఉండదు. డబ్బులు లోడ్‌ చేసినప్పడు ఉన్న విలువే కొనసాగుతుంది. ఫారెక్స్‌ కార్డులను అంతర్జాతీయంగా వినియోగించడం కోసం రూపొందించారు. వాటిని వినియోగించడం వల్ల అదనపు చార్జీలు ఉండవు. కొన్ని బ్యాంకులు మాత్రం విదేశాల్లో ఏటీఎం ఉపసంహరణల కోసం నామమాత్రపు రుసుమును వసూలు చేస్తాయి. తరచూ విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు, అక్కడ చదువుకునే విద్యార్థులకు ఈ కార్డు చాలా ఉపయోగంగా ఉంటుంది. మార్పిడి రుసుమును గణనీయంగా ఆదా చేసుకునే అవకాశం కలుగుతుంది.

ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది ‍వ్యాపారులు ఫారెక్స్‌ కార్డులను ఆమోదిస్తున్నారు. కాబట్టి ఏ దేశంలోనైనా వీటిని చక్కగా వినియోగించుకోవచ్చు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ బుక్కింగ్‌ కోసం కూడా వాడుకోవచ్చు. విదేశాల్లో పర్యటించినప్పుడు జేబులో డబ్బులు ఉంటే దొంగతనానికి గురయ్యే అవకాశం ఉంది. అదే ఫారెక్స్‌ కార్డులో ఎలాంటి భయం ఉండదు. దీనికి ప్రత్యేకమైన పిన్‌ ఉంటుంది. కాబట్టి వేరొకరు ఉపయోగించలేదు. ఒకవేళ ఎవరైనా దొంగిలించినా మనం వెంటనే కార్డును బ్లాక్‌ చేసుకోవచ్చు. ఒక ఫారెక్స్‌ కార్డులో అనేక కరెన్సీలను లోడ్‌ చేసుకోవచ్చు. అంటే ఒకే కార్డులో యూఎస్‌ డాలర్‌, యూరో, జీబీపీ తదితర బ్యాలెన్స్‌ లను పెట్టుకోవచ్చు. కాబట్టి ఏ దేశంలో పర్యటించినా ఎలాంటి ఇబ్బంది ఉండదు.