సంక్రాంతి పండుగ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్స్ ఇచ్చింది. ప్రత్యేక రైళ్లకు హాల్ట్‌లను ఏర్పాటు చేసింది. అంతేకాదు ప్రయాణికులు డిస్కౌంట్ కూడా పొందేందుకు ఛాన్స్ ఉంది.
సంక్రాంతి దగ్గరకు వచ్చింది. ఇక ఊర్లకు వెళ్లేందుకు జనాలు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఆర్టీసీ కూడా స్పెషల్ బస్సులను నడిపిస్తోంది. సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని.. హైదరాబాద్ నగరంలో ఉండేవారికి సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది.
సికింద్రాబాద్, లింగంపల్లి నుంచి నడిచే 16 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హైటెక్ సిటీ స్టేషన్‌లో, సికింద్రాబాద్ టూ విజయవాడ మార్గంలో నడిచే మరో 11 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు చర్లపల్లిలో ప్రత్యేకంగా హాల్ట్‌లను ఏర్పాటు చేసింది సౌత్ సెంట్రల్ రైల్వే. ఈ సదుపాయం ఈ నెల 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. దీంతో సంక్రాంతికి ఇంటికి వెళ్లేవారికి, తిరిగి వచ్చేవారికి స్పెషల్ ట్రైన్స్ ఎంతగానో ఉపయోగపడనున్నాయి.
హైటెక్ సిటీలో 16 రైళ్లు
హైటెక్ సిటీలో మచిలీపట్నం-బీదర్ ఎక్స్‌ప్రెస్, నర్సాపూర్-లింగంపల్లి ఎక్స్‌ప్రెస్, లింగంపల్లి-విశాఖపట్నం జన్మభూమి, కాకినాడ టౌన్-లింగంపల్లి గౌతమి, సాయినగర్- మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్, సాయినగర్- కాకినాడ ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం- ముంబయి ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్, మచిలీపట్నం- సాయినగర్, కాకినాడ- సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్, లింగంపల్లి- కాకినాడ ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం- లింగంపల్లి జన్మభూమి, ముంబయి- విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్, లింగంపల్లి- కాకినాడ గౌతమి ఎక్స్‌ప్రెస్, లింగంపల్లి- నర్సాపుర్ ఎక్స్‌ప్రెస్, బీదర్- మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ ట్రైన్లకు హాల్ట్ ఉంది.
చర్లపల్లిలో 11 రైళ్లు
ఇక చర్లపల్లిలోనూ పలు రైళ్లకు హాల్ట్ ఉంటుంది. అవి సికింద్రాబాద్ – గూడూరు – సికింద్రాబాద్ సింహపురి, కాకినాడ – లింగంపల్లి – కాకినాడ గౌతమి, కాకినాడ – లింగంపల్లి – కాకినాడ కాకినాడ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్ – విశాఖపట్నం- సికింద్రాబాద్ గరీబ్‌రథ్, సికింద్రాబాద్ – భువనేశ్వర్ విశాఖ, హైదరాబాద్ – విశాఖపట్నం గోదావరి, తిరుపతి – సికింద్రాబాద్ – తిరుపతి పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లు 20వ తేదీ దాకా చర్లపల్లి స్టేషన్‌లో ఆగుతాయి. హైదరాబాద్‌లో ఉండేవారు ఈ సర్వీసులను ఉపయోగించుకోవచ్చు.
రైల్‌వన్ యాప్ డిస్కౌంట్
మరోవైపు రైల్వేశాఖ కొత్త ఆఫర్ ప్రకటించింది. అది ఏంటంటే.. రైల్‌వన్ యాప్ ద్వారా అన్‌రిజర్వుడ్ టికెట్లు కొనుగోళ్లపై 3 శాతం డిస్కౌంట్ అందిస్తున్నారు. ఈ ఆఫర్ కూడా జనవరి 14 నుంచి జూలై 14వ తేదీ వరకు అమలులో ఉంటుంది దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ యాప్‌తో రిజర్వుడు, అన్‌రిజర్వుడు ప్రయాణ టికెట్స్, ప్లాట్‌ఫామ్ టికెట్లు పొందవచ్చు.


































