ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగం పైన టూరిజం శాఖ చాలా ఫోకస్ చేస్తుంది. ఇందులో భాగంగా అరకు పర్యాటకులకు అద్భుతమైన, విలాసవంతమైన వసతులతో కారవాన్ బస్సులను అందుబాటులోకి తీసుకురావడానికి రెడీ అయింది.
ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ, ఓ జి డ్రీమ్ లైనర్ సంస్థ సంయుక్తంగా కారవాన్ బస్సులను త్వరలో అందుబాటులోకి తీసుకు రానున్నాయి. ఈ విలాసవంతమైన బస్సులు నగరవాసులకు అద్భుతమైన పర్యాటక అనుభూతిని అందిస్తాయి.
సందర్శకులకు అందుబాటులోకి ఏసీ కారవాన్ బస్సులు
పర్యాటక శాఖతో తుది ఒప్పందం కుదిరిన తర్వాత దీని ప్యాకేజీలు ఏ విధంగా ఉంటాయనేది ప్రకటన చేయనున్నారు. సకల సౌకర్యాలతో ఏసీ సదుపాయంతో, విశాలమైన పడక గదులు, విశాలమైన హాలు, వంటగది, టాయిలెట్స్ ఇలా అన్ని వసతులతో ఏసీ కారవాన్ లు విశాఖపట్నం నుండి అరకు, పాడేరు, వంజంగి, లంబసింగి, అరసవల్లి, శ్రీకాకుళం, సీతంపేట, అన్నవరం, రాజమహేంద్రవరం, కాకినాడ వంటి ప్రాంతాలకు వెళ్లే సందర్శకులకు అందుబాటులోకి రానున్నాయి.
కారవాన్ బస్సులలో అందుబాటులోకి అనేక సౌకర్యాలు
ఈ కారవాన్ బస్సుల ద్వారా సందర్శకులు ఈ ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంది.ఈ కారవాన్ బస్సులలో కూర్చోవడానికి సోఫాలు, బెడ్లు ,మ్యూజిక్ సిస్టం, టీవీలు, వైఫై సౌకర్యం ఇలా అనేక వసతులు అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు నచ్చిన ఆహారాన్ని వండుకోవడానికి వంటగదిని కూడా అందులో ఏర్పాటు చేశారు. 2500 రూపాయలు ఒక వ్యక్తికి చెల్లిస్తే ఈ బస్సులో ఒకరోజు పగలు, రాత్రి బస చేయవచ్చు.
ఒకరోజు బస చెయ్యాలంటే ఖర్చు ఇలా
24 గంటల పాటు ఇందులో బస చేయడానికి 2500 రూపాయలు చెల్లించాలి. అయితే పర్యాటకశాఖతో ఒప్పందం జరిగితే ఆ తర్వాత ఈ ధరలను పక్కాగా ఎంత అనేది నిర్వాహకులు చెప్పే వీలుంటుంది. ఒకేసారి ఈ బస్సులలో 10 నుండి 15 మంది ప్రయాణం చేయవచ్చు. ఇక ఈ ప్యాకేజీలో ఉదయం టిఫిన్, రాత్రి భోజనం వరకు అన్ని ఏర్పాట్లు వారే చేస్తారు.
త్వరలో అందుబాటులోకి ఓజీ కారవాన్ బస్సులు
ఒకవేళ ఎవరికైనా ప్రత్యేక వంటకాలు కావాలంటే ముందుగా తెలియజేస్తే వాటిని తయారు చేయించి పెడతారు. ఇక ఇది మాత్రమే కాదు ఎక్కడికి వెళ్ళినా అక్కడ పర్యాటక ప్రాంతాల విశేషాలు చెప్పడానికి ఇందులో ఒక గైడ్ కూడా ఉంటాడు. త్వరలోనే ఈ ఓ జి కారవాన్ బస్సులు అందుబాటులోకి వస్తాయి. ఎందుకు ఆలస్యం విశాఖపట్నం నుండి అరకు, లంబసింగి వంటి ప్రాంతాలకు వెళ్లాలనుకునేవారు ఈ కారవాన్ టూరిజాన్ని హాయిగా ఎంజాయ్ చేయండి.
































