దేశంలోని పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కేంద్ర ప్రభుత్వం వినూత్నమైన పథకాలను ప్రవేశపెడుతోంది. ఆర్థికసాయం అందించి పేదవారికి అండగా నిలిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. అయితే ప్రభుత్వం అందించే పథకాల గురించి తెలియక చాలా మంది ప్రయోజనాలను పొందలేక పోతున్నారు. ఇటీవల భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చారు. ప్రధాన మంత్రి సూరజ్ పోర్టల్ ప్రారంభించారు. మోదీ 13 మార్చి 2024న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పోర్టల్ ద్వారా షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతులు, పారిశుద్ధ్య కార్మికులు సహా దేశవ్యాప్తంగా అర్హులైన పౌరులకు రుణ లభిస్తుంది. ఏకంగా 15 లక్షల వరకు రుణాలు పొందొచ్చు.
షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతులు, పారిశుధ్య కార్మికులతో సహా దేశవ్యాప్తంగా అర్హులైన వ్యక్తులకు రుణ సహాయం అందించేందుకు పీఎం సూరజ్ పోర్టల్ ను ప్రారంభించింది ప్రభుత్వం. పీఎం సూరజ్ పోర్టల్ ద్వారా అర్హులైన పౌరులకు రూ.1లక్ష వరకు లోన్ లు ఇవ్వడంతోపాటూ రూ.15 లక్షల వరకూ వ్యాపార రుణాలు కూడా ఇస్తారు. లోన్ పొందడానికి, అర్హులైన పౌరులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3 లక్షల మంది యువత ఈ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ప్రధాన మంత్రి సూరజ్ పోర్టల్ కింద దేశంలోని లక్ష మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.720 కోట్లు జమ చేశారు.
ప్రధాన్ మంత్రి సూరజ్ పోర్టల్ ప్రయోజనాలను పొందేందుకు, దరఖాస్తుదారు తప్పనిసరిగా భారత పౌరుడై ఉండాలి. దరఖాస్తుదారుడి వార్షిక ఆదాయానికి పరిమితి విధించలేదు. వ్యాపారం చేయాలనుకునే వారు మాత్రమే ఈ పోర్టల్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పీఎం సూరజ్ పోర్టల్‌లో దరఖాస్తు చేయడానికి ఆధార్ కార్డు, గుర్తింపు కార్డు, రేషన్ కార్డు, చిరునామా రుజువు, ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, బ్యాంకు ఖాతా పాస్ బుక్, పాస్పోర్ట్ సైజు ఫోటో, ఇమెయిల్ ఐడి ఉండాలి. ప్రధాన మంత్రి సూరజ్ అధికారిక పోర్టల్ https://sbms.ncog.gov.in ను సందర్శించి అవసరమైన వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత లోన్ మంజూరవుతుంది. ఈ పథకం ద్వారా లోన్ పొంది వ్యాపారంలో రాణించే వీలుంటుంది.