కేరళ టూర్‌ ప్లాన్ చేస్తున్నారా.? ఈ బీచ్ గురించి తెలుసుకోవాల్సిందే.

www.mannamweb.com


భారతదేశంలో పండుగల సీజన్‌లో వరుసగా సెలవులు వస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో చాలా మంది ఈ సెలవులకు అనుగుణంగా ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ప్రస్తుత వర్షాకాలంలో చాలా మంది ప్రకృతి ప్రేమికులు లాంగ్ ట్రిప్స్ వేస్తూ ఉంటారు. భారతదేశంలోని సుందరమైన ప్రకృతిని ఆశ్వాదించాలంటే అందరూ కేరళ రాష్ట్రాన్నే ఎంచుకుంటారు. అయితే కేరళలో కూడా ఓ బీచ్ ఇటీవల అందరినీ ఆకర్షిస్తుంది. కేరళలోని కన్నూర్‌లోని ముజప్పిలంగాడ్‌లో ఆసియాలోనే అతి పొడవైన డ్రైవ్-ఇన్ బీచ్ పునర్నిర్మాణంలో ఉంది. ఆసియాలోనే అతిపెద్ద డ్రైవ్-ఇన్ బీచ్‌గా గుర్తింపు పొందిన ముజప్పిలంగడ్ బీచ్ పునర్నిర్మించి నూతన సంవత్సర కానుకగా అందుబాటులోకి తెస్తామని పబ్లిక్ వర్క్స్, టూరిజం మంత్రి ప్రకటించారు. ఈ నేపథ్యంలో ముజప్పిలంగడ్ బీచ్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

ధర్మాడం-ముజప్పిలంగాడ్ సమగ్ర పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా ప్రస్తుతం పునర్నిర్మాణంలో ఉన్న బీచ్‌ను మంత్రి ఇటీవల సందర్శించారు. తన పర్యటనలో కేరళ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (కేటీడీసీ) అభివృద్ధి చేస్తున్న త్రీ స్టార్ హోటల్ కాంప్లెక్స్‌తో సహా కొనసాగుతున్న నిర్మాణాన్ని మంత్రి పరిశీలించారు. 70 శాతం పనులు పూర్తయ్యాయని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. ముజప్పిలంగడ్ బీచ్ సుందరీకరణ ప్రాజెక్టుకు రూ.233 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. ఈ ప్రత్యేకమైన బీచ్‌లో సముద్ర తీరంలో మీ కారును డ్రైవ్ చేసే అవకాశం ఉంటుంది.. జప్పిలంగడ్ బీచ్ ప్రకృతి సౌందర్యానికి కూడా ప్రసిద్ధి చెందింది. డ్రైవ్-ఇన్ అనుభవంతో పాటు, వాకింగ్ పాత్‌లు, ప్లేగ్రౌండ్‌లు, కియోస్క్‌లతో సహా అనేక ఇతర సౌకర్యాలు ఇక్కడ అభివృద్ధి చేస్తున్నారు. వాటర్ స్పోర్ట్స్, పారాసైలింగ్, పవర్ బోటింగ్, మైక్రోలైట్ ఫ్లైట్స్ వంటి అడ్వెంచర్ యాక్టివిటీస్ కోసం సౌకర్యాలు ఆకర్షిస్తాయి.

ముజప్పిలంగాడ్ బీచ్ తలస్సేరి టౌన్ నుంచి కేవలం 7 కి.మీ దూరంలో ఉంది. ఇది కేరళలోని ప్రధాన పట్టణాలు, నగరాలకు బాగా అనుసంధానమై ఉంటుంది. ఈ బీచ్ సమీపంలో అంటే 15 కి.మీ దూరంలో కన్నూర్ రైల్వే స్టేషన్ ఉంది. రాష్ట్రంలోని ప్రధాన నగరాల నుండి ప్రతిరోజూ అనేక ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఈ స్టేషన్‌కు వస్తుంటాయి. సమీప విమానాశ్రయం కరిపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది బీచ్ నుండి 100 కి.మీ దూరంలో ఉంది. అలాగే సందర్శకులందరికీ భద్రత కల్పించేందుకు బీచ్‌లో వేగ పరిమితి 30 కిలోమీటర్లకు పరిమితం చేశారు. ఈ పరిమితిని దాటితే జరిమానా విధిస్తారు. ఈ బీచ్‌కి కారులో చేరుకోవడానికి నామమాత్రపు ప్రవేశ రుసుము రూ. 30. ప్రతి ఏప్రిల్‌లో ఇక్కడ యాన్యువల్ బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. ప్రకృతి అందాలతో మెరుగైన బీచ్ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను పొందాలంటే ముజప్పిలంగాడ్ బీచ్‌ను సందర్శిచవచ్చు.