40ఏళ్లకే రిటైర్మెంట్​కు ప్లాన్​ చేస్తున్నారా? 33 ఏళ్లకే రూ.2 కోట్లు సంపాదించిన టెకీ స్టోరీ చదవాల్సిందే

మునుపటి తరం వారి దృష్టిలో రిటైర్‌మెంట్ ఏజ్ అంటే 60 ఏళ్లు. అయితే ఈతరం యువతలో ఎంతోమంది వీలైనంత త్వరగా 40ఏళ్లే రిటైర్ అయిపోయి, స్ట్రెస్ లేని హ్యాపీ లైఫ్‌ను గడపాలని కోరుకుంటున్నారు. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రిటైర్ ఎర్లీ (ఫైర్) అనుగుణంగా వారంతా ఫ్యూచర్, కెరీర్‌లను ప్లాన్ చేసుకుంటున్నారు. వీలైనంత త్వరగా ఆర్థిక స్వాతంత్య్రాన్ని సాధించి రిటైర్ అయిపోవాలని ఫైర్ కాన్సెప్ట్ చెబుతుంది. దీన్ని ఫాలో అయిపోయి 33 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తన నెట్‌వర్త్‌ను అనతి కాలంలోనే రూ.2 కోట్లకు పెంచుకున్నారు. 42 ఏళ్లు వచ్చే సమయానికి రూ.20 కోట్లను సంపాదించుకొని రిటైర్ అయిపోవాలని ఆయన టార్గెట్‌గా పెట్టుకున్నారు. తన స్ఫూర్తిదాయక సక్సెస్ స్టోరీని ఆ యువతేజం రెడిట్ అనే సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. దాని నుంచి మనమూ కొంత నేర్చుకుందాం.


మొదటి రూ.1 కోటికి 9 ఏళ్ల సమయం
ఆయనొక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. 11 ఏళ్ల క్రితమే కెరీర్ మొదలైంది. ప్రస్తుతం 33 ఏళ్ల వయసులో ఉన్న ఆయన ఓ సైబర్ సెక్యూరిటీ కంపెనీలో కీలక హోదాలో ఉద్యోగ బాధ్యతలను నిర్వరిస్తున్నారు. రెడిట్‌లో ఆయన పెట్టిన పోస్ట్ ప్రకారం మొదటి కోటి రూపాయలను కూడబెట్టడానికి 9 ఏళ్ల సుదీర్ఘ సమయం పట్టింది. 2023 సెప్టెంబరు నాటికి ఆయన నెట్‌వర్త్ రూ.1 కోటికి చేరుకుంది. అయితే ఆ తర్వాత కేవలం 18 నెలల్లోనే రూ.1 కోటి కాస్తా రూ.2 కోట్లు అయిపోయాయి. ఇదెలా సాధ్యమైందో సదరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వివరించారు.

18 నెలల్లోనే రూ.2 కోట్లు ఎలా అయ్యాయి ?

  • సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కథనం ప్రకారం, ఆయన తన పెట్టుబడులను ఏదో ఒకేచోటకు పరిమితం చేయలేదు. చాలా విభాగాల్లో డబ్బులను మదుపు చేశారు. దీనివల్ల రిస్క్ తగ్గింది. లాభదాయకత పెరిగింది.
  • 2014లో కెరీర్ ఆరంభంలోనే ఆయనకు రూ.3.25 లక్షల వార్షిక వేతన ప్యాకేజీ లభించేది. ప్రస్తుతం ఆయన వార్షిక శాలరీ ప్యాకేజీ రూ.95 లక్షలు(స్టాక్ ఆప్షన్స్ సహా). ఇప్పుడు ఆయన ఇంటి అద్దె, పిల్లల స్కూలు ఫీజులు, ఇంటి సామాన్లు, ఇంధనాలు, నెలవారీ సబ్‌స్క్రిప్షన్లకు ప్రతినెలా రూ.1.20 లక్షల దాకా ఖర్చు చేస్తున్నారు.
  • 9 ఏళ్లలో తాను సంపాదించిన రూ.1 కోటిని లాంగ్ టర్మ్ విజన్‌తో షేర్లు, మూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టగా, అవి కాస్తా 18 నెలల్లోనే రూ.2 కోట్లు అయ్యాయని ఆ టెకీ తెలిపారు.
  • ఆ టెకీ ప్రతినెలా వచ్చే శాలరీలో దాదాపు రూ.2 లక్షలను (శాలరీలో 60 శాతం) మూచువల్ ఫండ్లు, భారతీయ కంపెనీల షేర్లు, అమెరికా కంపెనీల షేర్లు, ఎన్‌పీఎస్, ఈపీఎఫ్‌లలో మదుపు చేస్తుంటారు. మూచువల్ ఫండ్ల విషయానికొస్తే.. ఇండెక్స్, ఫ్లెక్సీ క్యాప్ రకం ఫండ్లనే ఆయన ఎంపిక చేసుకుంటారు. వీటిలోనూ కాంట్రా, థిమాటిక్ రకాల మూచువల్ ఫండ్ స్కీమ్స్ చాలామంచివని సదరు టెకీ తెలిపారు. మార్కెట్‌కు వ్యతిరేక దిశలో పెట్టుబడులు పెట్టడం అనేది కాంట్రా మూచువల్ ఫండ్ స్కీమ్ ప్రత్యేకత. నిర్దిష్ట రంగాలు, పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టడం అనేది థిమాటిక్ మూచువల్ ఫండ్ స్కీమ్స్ విశిష్టత.
  • ప్రస్తుతం సదరు టెకీ వద్దనున్న రూ.2 కోట్లలో రూ.60 లక్షలు భారతీయ కంపెనీల షేర్లలో ఉన్నాయి. రూ.46 లక్షలు మూచువల్ ఫండ్లలో, రూ.42 లక్షలు అమెరికా షేర్లు, రిస్ట్రిక్టెటెడ్ స్టాక్ యూనిట్స్ (RSUs), ఎంప్లాయీ స్టాక్ పర్ఛేజ్ ప్లాన్ (ESPPs)లలో ఉన్నాయి. రూ.26 లక్షలు ఈపీఎఫ్‌, ఎన్‌పీఎస్‌లలో, రూ.23 లక్షలు సేవింగ్స్, ఎఫ్‌డీలలో, రూ.13 లక్షలు బంగారంలో, రూ.7 లక్షలు బాండ్లలో ఉన్నాయి.
  • ‘ఆదాయం భారీగా పెరగడం + క్రమశిక్షణాయుతంగా పెట్టుబడులు పెట్టడం = సంపద సృష్టి’ అనే సూత్రం వల్లే తనకు ఇంతటి ఆర్థిక పురోగతి సాధ్యమైందని సదరు టెకీ వివరించారు. ఇతరులు కూడా దీన్ని ఫాలో అయితే విజయం తథ్యమన్నారు. ఉద్యోగంలో వేతనం పెరగాలంటే స్కిల్స్‌ను క్రమంగా పెంచుకోవాలని సూచించారు. స్కిల్స్‌ను పెంచుకునేందుకు కొంత డబ్బును ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. నైపుణ్యాలకు పదును పెట్టుకుంటూ, ఆదాయ ప్రవాహాన్ని పెంచుకుంటూ ముందుకుసాగితే సంపద సృష్టి దానంతట అదే జరుగుతుందన్నారు.

ఫ్యూచర్ ప్లాన్ ఇదేనట
45 ఏళ్లలోగా రూ.10 కోట్లను సంపాదించుకొని రిటైర్ అయిపోవాలని సదరు టెకీ తొలుత భావించారు. అయితే రూ.1 కోటి సంపాదించాక, సంపద అత్యంత వేగంగా పెరుగుతుండటం వల్ల ఆయన తన ప్లాన్‌లో కీలక మార్పు చేశారు. 42 ఏళ్లలోగా రూ.20 కోట్లను కూడబెట్టుకొని జాబ్ నుంచి రిటైర్ అయిపోవాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. తనకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారని, వారికి మంచి విద్యను అందిస్తానన్నారు. తన భార్య ఏదైనా బిజినెస్ పెట్టాలని చూస్తోందని, ఆమెకు కొంత సాయం చేస్తానని ఆ టెకీ రెడిట్‌లో రాసుకొచ్చారు. తప్పకుండా ఒక ఇంటిని కొంటానన్నారు. 40 ఏళ్ల తర్వాత ఏమాత్రం స్ట్రెస్ లేకుండా జీవించాలని తాను కోరుకుంటున్నానని ఆయన తెలిపారు.

మీరు కూడా ‘ఫైర్’ను ఫాలో అవుతారా ?

  • మీరు కెరీర్‌లో పురోగతిని సాధించాలంటే, ఆదాయాన్ని పెంచుకోవాలంటే స్కిల్స్‌ను పెంచుకోండి. అందుకోసం ప్రత్యేక కోర్సులు చేయండి. తగిన శిక్షణ పొందండి.
  • తాను ఆదాయంలో 60 శాతం దాకా పెట్టుబడులు పెట్టానని సదరు టెకీ చెప్పారు. వీలైతే మీరూ అలా చేయండి.
  • నిపుణుల సలహాతో మంచి షేర్లు, మూచువల్ ఫండ్లలో లాంగ్ టర్మ్ విజన్‌తో పెట్టుబడులు పెట్టండి.
  • ఫైర్ అంటే తొందరపాటుతో ఉద్యోగాన్ని వదిలేయడం కాదని గుర్తుంచుకోండి. సమగ్రంగా ఫ్యూచర్ ప్లాన్‌ను అమలు చేయడం అని తెలుసుకోండి.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.