APPSC: అటవీ కొలువులకు సిద్ధమేనా?

అటవీ శాఖలో 691 ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్స్‌ ఉద్యోగాల నియామకానికి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇదే శాఖకు చెందిన ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్టులను కూడా త్వరలో భర్తీ చేయనున్నారు. 


ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్స్‌ ఉద్యోగాలకు 01.07.2025 నాటికి 18-30 సంవత్సరాల వయసు ఉండాలి. ఎస్‌సీ, ఎస్‌టీ, ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు గరిష్ఠ వయసులో మినహాయింపు ఉంది. క్యారీ ఫార్వర్డ్‌ అయిన ఉద్యోగాలకు 10 ఏళ్లూ, కొత్తగా ప్రకటించిన ఉద్యోగాలకు 5 ఏళ్లూ సడలింపు ఇస్తారు.

కనీస విద్యార్హత ఇంటర్మీడియట్‌. 14.7.25 నాటికి ఉత్తీర్ణులై ఉండాలి. ఈ ఉద్యోగాలకు ప్రధానంగా శారీరక కొలతల అర్హత, నడక పరీక్షలూ ఉంటాయి. నోటిఫికేషన్‌లో పేర్కొన్నవిధంగా కొలతలూ, ఇతర ప్రమాణాలను పరిశీలించుకుని ఈ పరీక్షకు సిద్ధపడాలి.

అభ్యర్థి తన జిల్లాలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో చూసుకుని రంగంలోకి దిగటం మేలు. 20 శాతం ఉద్యోగాలు నాన్‌ లోకల్‌ ఉంటాయి కాబట్టి ఒకవేళ సొంత జిల్లాలో ఉద్యోగాలు లేనట్లయితే పక్క జిల్లాల వైపు చూడవచ్చు.

స్క్రీనింగ్‌ పరీక్ష తర్వాత మెయిన్స్‌ పరీక్ష ఉంటుంది. కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ కూడా నిర్వహిస్తారు. నిర్దిష్ట నిష్పత్తిలో మెయిన్స్‌ నుంచి ఎంపిక చేసినవారికి నడక, మెడికల్‌ పరీక్షలు నిర్వహిస్తారు. అన్నిట్లోనూ అర్హత పొందినవారిని పరిగణనలోకి తీసుకుని ఫైనల్‌ ర్యాంకింగ్‌ నిర్ణయిస్తారు. రోస్టర్‌ పాయింట్ల ఆధారంగా ఉద్యోగాలు ఇస్తారు.

స్క్రీనింగ్‌ పరీక్ష 150 మార్కులకు ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. 150 నిమిషాల్లో 150 ప్రశ్నలను గుర్తించాలి. ఇందులో పార్ట్‌ ఎ, పార్ట్‌ బి అని రెండు భాగాలు. ఒక్కొక్కటి 75 ప్రశ్నలు 75 మార్కులకు ఉంటాయి. నెగిటివ్‌ మార్కింగ్‌ కూడా ఉంది.

ఈ పరీక్షను 2025 సెప్టెంబర్‌ 7న నిర్వహించబోతున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది.

45 రోజుల సమయమే ఉంది కాబట్టి సిలబస్‌ రీత్యా కొత్త అభ్యర్థులకు సవాల్‌ లాంటిది. ముఖ్యంగా ఇంటర్మీడియట్‌ విద్యార్హత కాబట్టి చాలామంది ఇంటర్‌ పాసైన అభ్యర్థులకు ఆశలుంటాయి. కానీ ఇప్పటికే గ్రూప్‌ 1, 2 లాంటి ఇతర పోటీ పరీక్షలకు సిద్ధపడి, వయసు, శారీరక ప్రమాణాలున్నవారు నెగ్గటానికి మంచి అవకాశాలున్నాయని చెప్పవచ్చు. కొత్తగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు పూర్తిగా ఆశలు వదులుకోకుండా చదవాలి.

స్క్రీనింగ్‌ పరీక్ష నెగ్గాలంటే.. 

పార్ట్‌ ఎ: పరిమిత సిలబస్‌కు ప్రాధాన్యం

  • ప్రతిరోజూ కనీసం గంట సేపయినా జాతీయ అంతర్జాతీయ వర్తమానాంశాలను పరిశీలించండి. గత ఆరు నెలల పరిణామాలను అధ్యయనం చేయండి.
  • సాధారణ స్థాయి రీజనింగ్‌ విభాగాలను నిత్యం సాధన చేయండి.
  • పర్యావరణ పరిరక్షణ- సంతులిత అభివృద్ధి.. పరిమిత సిలబస్సే కాబట్టి సులువుగా సిద్ధం కావొచ్చు. దీనిపై దృష్టి పెడితే మార్కులు సాధించడానికి వీలుంటుంది.
  • విపత్తు నిర్వహణ ఆసక్తి కలిగించే అంశం, సిలబస్‌ అంశాలు తక్కువ. అందుకని ప్రాథమిక స్థాయి పరిజ్ఞానానికి ప్రాధాన్యమిస్తూ ప్రిపేర్‌ అయితే పట్టు సాధించవచ్చు.
  • గ్రామీణ అభివృద్దిపై ప్రశ్నలడిగే అవకాశముంది.
  • భారత భౌగోళిక అంశాలనూ, ఆంధ్రప్రదేశ్‌ భౌగోళిక అంశాలనూ అనుసంధానించుకునే ప్రయత్నం చేయవచ్చు.
  • భారత రాజ్యాంగం అంశాలపై స్థూల అవగాహన, పాఠశాల స్థాయి పరిజ్ఞానంతో మార్కులు సాధించే అవకాశాలున్నాయి.
  • స్వల్ప వ్యవధి దృష్ట్యా చరిత్రలోని జాతీయోద్యమంపై దృష్టి పెడితే కొంత మేలు జరగవచ్చు. జాతీయోద్యమ సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని పరిణామాలపై స్థూల అవగాహన అవసరం.
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీపై ప్రశ్నలను కరెంట్‌ అఫైర్స్‌ ప్రాధాన్యంగా చదువుకుంటే మంచిది. మరీ లోతుగా వెళ్లకుండా తాజాగా జరిగిన పరిణామాలకూ, సంబంధిత వర్తమానాంశాలకూ పరిమితం అవ్వండి.

పార్ట్‌ బి: బేసిక్స్‌పై గట్టి పట్టు

  • జనరల్‌ సైన్స్‌ కోసం హైస్కూలు తరగతుల్లోని జంతు- వృక్షశాస్త్ర అంశాల ప్రాథమికాంశాలు (బేసిక్స్‌) బలంగా నేర్చుకుంటే సులభంగా మంచి మార్కులు వస్తాయి.
  • మానవ శరీర నిర్మాణానికి సంబంధించిన వివిధ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. మానవ జన్యు వారసత్వం, జీవుల పునరుత్పత్తి ప్రక్రియలు సులభమైన భాషలో నేర్చుకున్నా ఈ పరీక్షకు సరిపోవచ్చు. ఇటీవల గ్రూప్‌-2 మెయిన్స్‌ మాదిరే సాధారణ స్థాయి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అందుకే బేసిక్స్‌పై పట్టు సాధిస్తే మంచి అవకాశాలుంటాయి.
  • రసాయన శాస్త్రంలోని లోహ, అలోహ చాప్టర్స్‌పై, కార్బన్‌ సంబంధిత అంశాలపై పాఠశాల స్థాయి సమాచారం తెలిసివుండాలి.
  • ఇంధన వనరులపై ప్రాథమిక స్థాయి ప్రశ్నలు రావొచ్చు. శిలాజ, పునరుత్పత్తి ఇంధనాలు, వాటిలోని రకాలు, ఉత్పత్తి మెలకువలు, ప్రస్తుత ఉత్పత్తి స్థాయుల గురించి తెలుసుకోవాలి.
  • పర్యావరణ సంబంధిత విషయాలు కూడా సాధారణ స్థాయిలోనే సిలబస్‌ అంశాల వరకు సిద్ధమైతే సరిపోతుంది.
  • సాధారణ గణిత అంశాల విషయానికొస్తే- అంకగణితం, జామెట్రీ, స్టాటిస్టిక్స్‌ అనే మూడు విభాగాలున్నాయి. సిలబస్‌ రీత్యా చూస్తే ప్రాథమిక పరిజ్ఞానం ఈ మూడిట్లోనూ సరిపోతుంది.
  • గణితం నేపథ్యంలో ఇంటర్‌ చదివినవారికి పెద్ద సమస్యలుండకపోవచ్చు. కానీ గణిత నేపథ్యం లేనివారు కొంత ఇబ్బంది పడొచ్చు. వారు కూడా ఈ మూడు విభాగాల్లోని ప్రాథమిక అంశాలను రోజూ కనీసం మూడు గంటలు ప్రాక్టీస్‌ చేయటం మంచిది.
  • పాఠశాల పుస్తకాలలోని సంబంధిత సిలబస్‌ చూసుకుని సాధన చేయటం వల్ల ఫలితం ఉంటుంది.
  • పోటీ పరీక్షల పుస్తకాల్లో ఈ మూడు విభాగాలకు సంబంధించి ఇచ్చే షార్ట్‌ కట్స్‌ ప్రయోజనకరం.
  • గ్రూప్‌ 1, 2, ఇతర పోటీ పరీక్షల సన్నద్ధతపై ఇప్పటికే పట్టు సాధించినవారు సిలబస్‌ ప్రకారం మాత్రమే ప్రిపేరైతే సరిపోతుంది. ఆయా పరీక్షల్లో మాదిరిగా విస్తృత ప్రిపరేషన్‌ అవసరం ఉండకపోవచ్చు. ప్రధానంగా బేసిక్స్‌పై బాగా దృష్టి పెట్టాలి.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.