కాస్త లావు ఎక్కువగా ఉన్నవారు బరువు తగ్గాలనే ఉద్దేశంతో రాత్రిపూట తిండి మానేస్తుంటారు. మరి కొందరు ఉద్యోగాల నుంచి ఇంటికి తిరిగి రావడంలో ఆలస్యం కారణంగా ఏమీ తినకుండానే పడుకుంటారు.
కానీ ఇది ప్రమాదకరమని, వివిధ అనారోగ్యాలకు దారితీస్తుందని నిపుణులు అంటున్నారు. అదెలాగో చూద్దాం.
* బరువు తగ్గాలన్న ఉద్దేశంతోనో, టైమ్ లేదన్న కారణంతోనో రాత్రిపూట తిండి మానేస్తే జీవక్రియ నెమ్మదిస్తుంది. ఈ పరిస్థితి శరీరంలో ఇన్సులిన్ లెవల్స్‌ను నియంత్రించే శక్తిని బలహీన పరుస్తుంది. దీంతో బీపీ, షుగర్ పేషెంట్లు అయితే గనుక మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనే చాన్స్ ఉంటుంది. కాబట్టి రాత్రిపూట ముఖ్యంగా సాయంకాలం ఏడెనిమిది గంటలలోపు తినడం ఆరోగ్యానికి మంచిది.
* రాత్రిళ్లు తిండి మానేసేవారు తమకు తెలియకుండానే జంక్ ఫుడ్స్‌కు అలవాటు పడే అవకాశం ఎక్కువ. ఎందుకంటే కడుపు ఖాళీగా ఉంచుకోకుండా ఏదో ఒకటి తినాలనే కోరిక క్రమంగా పెరుగుతుంది. అన్నానికి బదులు కొందరు చిప్స్ లేదా ఓ స్వీటు ముక్క తింటుంటారు. కానీ ఇది అస్సలు మంచిది కాదు. మెల్లిగా ఈటింగ్ డిజార్డర్‌కు దారితీయవచ్చు.
* సమయం ప్రకారం శరీరానికి ఆహారం అందినప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. కావాల్సిన హార్మోన్లు రిలీజ్ అవుతాయి. రాత్రిళ్లు తిండి మానేయడంవల్ల ఈ ప్రక్రియకు ఆటంకం ఏర్పడుతుంది. హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది. క్రమంగా ఇతర అనారోగ్యాలకు కారణం అవుతాయి.
* సాయంత్రం ఏడు తర్వాత చేసే భోజనం శరీరంలో వివిధ జీవక్రియలను సమతుల్యం చేస్తుంది. కండరాల బలానికి కూడా ఇది ముఖ్యం. ఒకవేళ తినకుండా పడుకోవడం దీర్ఘకాలం కొనసాగిస్తే కండరాలు, నరాల బలహీనత వచ్చే అవకాశం కూడా ఉంది. అంతే కాకుండా ప్రోటీన్లు, అమైనో యాసిడ్స్ రిలీజ్ అయ్యే సామర్థ్యం కూడా తగ్గుతుంది.
* కారణాలేమైనా రాత్రిపూట తినకుండా నిద్రపోవడంవల్ల శరీరంలో పోషకాల లోటు ఏర్పడుతుంది. ఎనర్జీ లెవెల్స్ తగ్గి, నీరసం, బలహీనత ఆవహిస్తాయి. ఫలితంగా ఏ పనిమీదా ఆసక్తి ఉండదు. మూడ్ స్వింగ్స్ కూడా వస్తుంటాయి. కోపం, చిరాకు వంటివి పెరుగుతాయి.
* చాలా మంది రాత్రిళ్లు తినకుండా పడుకుంటే బరువు తగ్గుతామని భావిస్తారు. కానీ బరువు పెరిగే అవకాశాలే ఎక్కువట. ఎందుకంటే తినకపోవడం అనేది జీవక్రియ రేటును నెమ్మదిస్తుంది. శక్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇది ఒబేసిటీకి దారితీసే అవకాశం ఉంది. బరువు తగ్గాలనుకునే వారు రాత్రిళ్లు పూర్తిగా తిండి మానేయడం కాకుండా తేలికపాటి ఆహారాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.