క్రెడిట్‌ కార్డు వాడుతున్నారా.. బ్యాంకులు ఈ తప్పు చేస్తే మీకు రోజుకు రూ.500 ఇస్తాయి

www.mannamweb.com


నేటి కాలంలో క్రెడిట్‌ కార్డు వినియోగం అనేది సర్వసాధారణం అయ్యింది. అత్యవసర వేళ చేతిలో రూపాయి లేకపోయినా.. అర్జెంట్‌గా అప్పు పుట్టకపోయినా.. క్రెడిట్‌ కార్డు ఉంటే.. గండం గట్టెక్కవచ్చు. వ్యవధిలోగా చెల్లిస్తే.. ఎలాంటి వడ్డీ ఉండదు. కుదరకపోతే.. నెల వారి కొంత చెల్లించడం కోసం ఈఎంఐ విధానాన్ని ఎంచుకోవచ్చు. నేటి కాలంలో ఉద్యోగం, వ్యాపారం చేసే వారు మాత్రమే కాకుండా.. చాలా వరకు జనాలు క్రెడిట్‌ కార్డు వాడుతున్నారు. క్రెడిట్‌ కార్డు వల్ల ఉపయోగాల సంగతి ఎలా ఉన్నా.. నష్టాలే ఎక్కువ అంటారు. సకాలంలో చెల్లించకపోతే.. వడ్డీల మోతతో నడ్డి విరుస్తారు. పైగా ఆలస్యానికి జరిమానా కూడా విధిస్తారు. ఇంత వరకు అందరికి తెలుసు. కానీ క్రెడిట్‌ కార్డుకు సంబంధించి.. బ్యాంకులు తప్పు చేస్తే.. కార్డు హోల్డర్లకు రోజుకు రూ.500 చెల్లించాలనే రూల్‌ ఉందని మీకు తెలుసా. ఆ వివరాలు మీ కోసం..

మరి బ్యాంకులు ఎలాంటి తప్పులు చేస్తే.. క్రెడిట్‌ కార్డు హోల్డర్స్‌కి డబ్బులు చెల్లిస్తాయి అంటే.. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నిబంధనల ప్రకారం.. క్రెడిట్‌ కార్డు క్లోజ్‌ చేయమని కార్డు హోల్డర్‌ రిక్వెస్ట్‌ పెట్టుకున్న వారం రోజుల్లోగా అనగా ఏడు రోజుల్లోపు క్రెడిట్‌ కార్డును బ్యాంకులు మూసివేయాలి. అలా కాకుండా ఏదైనా కారణం చేత లేట్‌ చేస్తే మాత్రం బ్యాంకులే మీకు రోజుకు రూ.500 ఇవ్వాల్సి వస్తుంది. క్రెడిట్‌ కార్డు క్లోజర్‌కు సంబంధించి ఆర్బీఐ 2022లో అనగా రెండేళ్ల క్రితం ఈ రూల్‌ని తీసుకొచ్చింది. దీని ప్రకారం మీరు.. మీ క్రెడిట్‌ కార్డును రద్దు చేయమని బ్యాంకులో అప్లై చేసుకున్నట్లయితే.. సదరు బ్యాంకు ఏడు రోజుల్లోపు మీ క్రెడిట్‌ కార్డును మూసివేయాలి. ఒకవేళ ఆలస్యం చేస్తే.. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం అసలే లేదు. పైగా బ్యాంకు నుంచి మీకే రోజుకు 500 రూపాయలు వస్తాయి.

అయితే మీరు బ్యాంక్‌ నుంచి ఈ మొత్తం పొందాలంటే.. ముందుగా మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే.. మీ క్రెడిట్‌ కార్డు మూసివేసే ముందే.. మీరు మొత్తం అన్ని బకాయిలు చెల్లించారో లేదో నిర్ధారించుకోవాలి. పెండింగ్‌ బిల్స్‌ ఉంటే మీ క్రెడిట్‌ కార్డును బ్యాంకు మూసివేయదు. అంతేకాక మీరు పరిహారం పొందడానికి కూడా అర్హులు కారు. అలానే కార్డును మూసివేసే ముందు.. మీ రివార్డ్‌ పాయింట్లను రీడీమ్‌ చేసుకోండి. మీరు క్రెడిట్‌ కార్డు ఉపయోగించి చేసిన ఖర్చుల వల్లనే ఇవి మీ ఖాతాలోకి వస్తాయి.. కనుక వీటిని వృథా చేసుకోకండి. ఒక్కసారి క్రెడిట్‌ కార్డును క్లోజ్‌ చేస్తే.. ఆ తర్వాత అది దుర్వినియోగం కాకుండా చూడటం కోసం కార్డును కత్తిరించడం, విరగొట్టడం, కాల్చేయడం వంటివి చేయాలి.