సాధారణంగా తలనొప్పి వస్తే నొప్పి నివారణ మందులు వేసుకోవడం సర్వసాధారణం. కానీ చిన్నపాటి నొప్పులకు కూడా పదే పదే మాత్రలు వేసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు.
కొందరు శరీరంలోని ఏ భాగంలోనైనా కొంచెం నొప్పిగా అనిపిస్తే వెంటనే పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూ ఉంటారు. నొప్పి తగ్గించడంలో ఇవి చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇలా రకరకాల నొప్పులకు ఇలా పదేపదే మాత్రలు వేసుకోవడం అలవాటు చేసుకుంటే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకే వైద్యులను సంప్రదించకుండా ఎలాంటి మాత్రలు వేసుకోకపోవడం మంచిది. పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల వచ్చే సమస్యలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
జీర్ణశయాంతర సమస్యలు
ఆస్పిరిన్, ఇబుప్రోఫెన్ వంటి నాన్-స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (NSAIDs) దీర్ఘకాలిక వినియోగం కడుపు చికాకు, అల్సర్, అంతర్గత రక్తస్రావం సమస్యలను కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు.
కిడ్నీ దెబ్బతినే అవకాశం
పెయిన్ కిల్లర్స్ ఎక్కువ కాలం వాడటం వల్ల కిడ్నీలు దెబ్బతింటాయి. దీని వల్ల రక్తప్రసరణ సరిగా జరగదు. ఇది దీర్ఘకాలిక వ్యాధులు, మూత్రపిండాల వైఫల్యం ప్రమాదాన్ని పెంచుతుంది.
కాలేయ నష్టం
మీరు ఎసిటమైనోఫెన్ (పారాసెటమాల్) ఎక్కువగా తీసుకుంటే, అది కాలేయం మీద ప్రభావం చూపుతుంది. ఈ మాత్రలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా కాలేయ వైఫల్యానికి దారి తీస్తాయి.
తలనొప్పి
పెయిన్ రిలీవర్లను ఎక్కువగా వాడటం వల్ల కొందరిలో తలనొప్పి వస్తుంది. ఈ రకమైన తలనొప్పులు చాలా తీవ్రంగా ఉంటాయి.
పెయిన్ రిలీవర్ పిల్ తీసుకునేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి
పెయిన్‌కిల్లర్స్‌ను నాలుగైదు గంటల తేడాతో తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే వారానికి 2-3 సార్లు కంటే ఎక్కువ తీసుకోకూడదు. నొప్పి చాలా కాలం పాటు కొనసాగితే లేదా తరచుగా సంభవిస్తే వైద్యుడిని సంప్రదించాలి. ఈ విధమైన నొప్పులు తగ్గాలంటే జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి.