చెప్పినట్లుగానే ఆ ముగ్గురిని ఇంటికి పంపించిన సీఎం రేవంత్ రెడ్డి

www.mannamweb.com


ఎలాంటి ముందుస్తు అనుమతి లేకుండా అనధికారికంగా విద్యుత్తు సరఫరాను నిలిపివేస్తే కఠినచర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించినప్పటికీ వినకుండా విద్యుత్తును నిలిపివేసిన ముగ్గురు ఉద్యోగులు సస్పెండ్ అయ్యారు.
హైదరాబాద్ నగరంలోని కొండాపూర్‌ డివిజన్‌లో అల్లాపూర్‌ సెక్షన్‌ పరిధిలోని అయ్యప్ప సొసైటీ ఉపకేంద్రంలో విధులు నిర్వహిస్తున్న లైన్ మెన్ నరసింహ, జూనియర్ లైన్ మెన్లు దస్రు, విజయ్ ను అధికారులు సస్పెండ్ చేశారు.

సర్వే ఆఫ్‌ ఇండియా కాలనీలో శుక్రవారం అనధికారికంగా ఈ ముగ్గురు విద్యుత్‌ సరఫరాను నిలిపేశారు. తర్వాత ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకోకుండా నిర్మాణంలో ఉన్న ఓ భవానికి విద్యుత్తు తీగలను మార్చడం చేశారు. దీనిపై సీఎండీకి ఫిర్యాదు అందడంతో ఆయన వెంటనే విచారణకు ఆదేశించారు. విచారణలో వీరు కావాలనే చేసినట్లు తేలడంతో ముగ్గురినీ సస్పెండ్ చేసినట్లు కొండాపూర్ డీఈ తెలిపారు.

 

రాష్ట్రంలో ఎక్కడైనా అకారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే అందుకు బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించిన సంగతి తెలిసిందే. అవసరాలకు సరిపడా విద్యుత్తును ప్రసారం చేస్తూ ఎక్కడా కోతలు విధించడంలేదని సీఎం చెప్పారు. గతం కంటే విద్యుత్తు సరఫరా పెరిగిందని, అయినప్పటికీ కొందరు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు, విద్యుత్తు సరఫరాపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేసేందుకు కొందరు కుట్రలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ముఖ్యమంత్రి తెలిపారు. అటువంటి పనులకు పాల్పడే అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించినప్పటికీ వినకుండా పై ముగ్గురు వ్యవహరించడంతో కఠిన చర్యలు తీసుకున్నారు.