కాకినాడలో దారుణం.. ఆడపిల్ల పుట్టిందనీ గోడకేసి కొట్టి చంపిన కసాయి తండ్రి

www.mannamweb.com


ఆడపిల్ల అంటే ఛీత్కారం.. ఆడపిల్లంటే చులకన భావం.. తరతరాలుగా వస్తున్న అనవాయితేమో ఇది. నానాటికీ ప్రపంచం మునుముందుకు దూసుకుపోతుంటే..

దురాచారాల ముసుగులో భారత్‌ వెనక్కెనక్కిపోతుంది. అన్ని రంగాల్లో మగవారితో సమానంగా మహిళలు దూసుకుపోతున్నా.. కొందరు ఇప్పటికీ ఆడపిల్లలను భారంగానే భావిస్తున్నారు. వారిపట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. పుట్టీపుట్టగానే కళ్లు కూడా తెరవని పసికందులను కడతేర్చుతున్నారు. తాజాగా అలాంటి అమానుష ఘటన కాకినాడలో చోటు చేసుకుంది. ఆడపిల్ల పుట్టిందని తెలుసుకున్న ఓ తండ్రి అమ్మేస్తానని చెప్పాడు. అందుకు భార్య నిరాకరించడంతో పొత్తిళ్లలోని పసికందును అమాంతం గోడకేసి కొట్టి హతమార్చాడా కసాయి తండ్రి. వివరాల్లోకెళ్తే..

కాకినాడలోని జగన్నాథపురం పప్పులమిల్లు ప్రాంతానికి చెందిన చెక్కా భవానీ అనే మహిళ భర్త కొన్నేళ్ల క్రితం మృతి చెందాడు. దీంతో ఆమె స్థానికంగా కేతా శివమణి అనే మరో వ్యక్తితో సహాజీవనం చేస్తోంది. వీరికి గతంలో కుమారుడు జన్మించాడు. ఆ బాలుడిని శివమణి మరో వ్యక్తి అమ్మే సొమ్ము చేసుకున్నాడు. 34 రోజుల క్రితమే వీరికి మరో ఆడ శిశువు జన్మించింది. ఆడపిల్ల పుట్టిందని అప్పటి నుంచి తీవ్ర అసంతృప్తితో ఉన్న శివమణి.. ఆడపిల్ల తనకు భారం అంటూ భవానీతో నిత్యం గొడవ పడేవాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి భవానీ వద్దకు వచ్చిన శివమణి.. మంచి బేరం కుదిరిందని, బిడ్డను అమ్మేస్తానని చెప్పాడు. దీంతో భవానీ బిడ్డను తనకు దూరం చేయవద్దని ప్రాదేయపడింది. శివమణి మొండిపట్టుపట్టడంతో బిడ్డను అమ్మేందుకు అంగీకరించేది లేదని భవానీ తెగేసి చెప్పింది.

ఈ క్రమంలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. తీవ్ర కోపోధ్రిక్తుడైన శివమణి మంచంపై నిద్రపోతున్న శిశువును తన చేతిలోకి తీసుకుని గోడకేసి కొట్టాడు. తీవ్రగాయాలపాలైన పసికందు అచేతనంగా నేలపై పడిపోయింది. తల్లడిల్లిన తల్లి స్థానికుల సాయంతో కాకినాడ జీజీహెచ్‌కు తీసుకెళ్లింది. అస్పత్రిలో చికిత్స పొందుతూ కాసేపటికే శిశువు మృతి చెందింది. బిడ్డ మృతి చెందిన విషయం తెలుసుకున్న శివమణి పరారయ్యాడు. దీనిపై సమాచారం అందుకున్న కాకినాడ వన్‌టౌన్‌ పోలీసులు సీఐ దుర్గారావు సంఘటనా స్థలానికి చేరుకుని, దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న నిందితుడు శివమణి కోసం పోలీసులు గాలిస్తున్నారు.