Raghurama: జగన్‌పై హత్యాయత్నం కేసు

www.mannamweb.com


Raghurama: జగన్‌పై హత్యాయత్నం కేసు

రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన హయాంలో సీఐడీ విభాగాధిపతిగా పనిచేసిన పీవీ సునీల్‌కుమార్, నిఘా విభాగాధిపతిగా వ్యవహరించిన పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు సహా మరికొందరిపై హత్యాయత్నం కేసు నమోదైంది. 2021 మే 14న రాజద్రోహం కేసులో తనను అరెస్టు చేసిన ఏపీసీఐడీ అధికారులు.. రాత్రంతా కస్టడీలో నిర్బంధించి చంపేందుకు యత్నించారంటూ ఉండి ఎమ్మెల్యే కె.రఘురామకృష్ణరాజు ఇటీవల ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుంటూరులోని నగరంపాలెం పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం కేసు నమోదు చేశారు. అప్పట్లో సీఐడీ అదనపు ఎస్పీగా పనిచేసిన ఆర్‌.విజయ్‌పాల్, గుంటూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌గా ఉన్న డాక్టర్‌ ప్రభావతితో పాటు ఇతరులను ఈ కేసులో నిందితులుగా చేర్చారు. ఐపీసీలోని 120బీ (నేరపూరిత కుట్ర), 166 (వ్యక్తిని గాయపరిచేందుకు ప్రభుత్వ ఉద్యోగి ఉద్దేశపూర్వకంగా చట్టాన్ని అతిక్రమించడం), 167 (ప్రభుత్వ ఉద్యోగి తప్పుడు డాక్యుమెంట్‌ తయారీ), 197 (తప్పుడు సర్టిఫికెట్‌ జారీ), 307 (హత్యాయత్నం), 326 (ప్రమాదకర ఆయుధంతో గాయాల పాలయ్యేలా దాడి), 465 (ఫోర్జరీ), 506 (నేరపూరిత బెదిరింపు) తదితర సెక్షన్ల కింద నిందితులపై కేసు నమోదైంది.

చంపేస్తానని సునీల్‌కుమార్‌ బెదిరించారు
‘వైకాపా ప్రభుత్వ విధానాల్లోని లోపాలను బయటపెడుతూ నాటి ముఖ్యమంత్రి జగన్‌పై విమర్శలు చేసినందుకు అప్పట్లో నరసాపురం ఎంపీగా ఉన్న నాపై మూడేళ్ల కిందట సీఐడీ అధికారులు రాజద్రోహం కేసు పెట్టారు. ఆ కేసులో హైదరాబాద్‌లోని ఇంట్లో నన్ను అదుపులోకి తీసుకున్నారు. నిబంధనల ప్రకారం అక్కడి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి ట్రాన్సిట్‌ వారెంట్‌ తీసుకుని రావాల్సి ఉండగా ఆ నిబంధన పాటించలేదు. వైద్య పరీక్షలు చేయించలేదు. బలవంతంగా పోలీసు వాహనంలోకి ఎక్కించి హైదరాబాద్‌ నుంచి నేరుగా గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి రాత్రి 9.30కు తరలించారు. ఆ రాత్రంతా అక్కడే ఓ గదిలో నిర్బంధించారు. సునీల్‌కుమార్, పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు సీఐడీ కార్యాలయానికి వచ్చారు. రబ్బరు బెల్ట్, లాఠీలతో తీవ్రంగా కొట్టారు. అప్పటికి నేను బైపాస్‌ సర్జరీ చేయించుకుని కొద్దిరోజులే అయ్యింది. ఆ మందులు వేసుకోవడానికి కూడా అనుమతించలేదు. కొందరు వ్యక్తులు నా ఛాతీపై కూర్చొని ఊపిరాడనివ్వకుండా చేసి చంపేందుకు యత్నించారు. నా ఫోన్‌ తీసుకుని దాని పాస్‌వర్డ్‌ చెప్పేంత వరకూ తీవ్రంగా కొట్టారు. సీఎం జగన్‌ను విమర్శిస్తే చంపేస్తానని బెదిరించారు. జగన్‌ ఆదేశాలతోనే నాపై హత్యాయత్నం జరిగింద’ని రఘురామ ఇటీవల గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేయగా, దానిపై న్యాయ సలహా తీసుకున్న అధికారులు కేసు నమోదు చేశారు.

కొత్త ప్రభుత్వంలో జగన్‌పై తొలి కేసు
ముఖ్యమంత్రిగా జగన్‌ చేసిన అరాచకాలపై కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక నమోదైన తొలి కేసు ఇదే. సీఐడీ కస్టడీలో తనను చంపేందుకు యత్నించారంటూ రఘురామకృష్ణరాజు మూడేళ్లుగా అనేక వేదికలపై చెబుతున్నారు. సంబంధిత ఆధారాలు, నివేదికలన్నీ బయటపెట్టారు. నాడు వైకాపా అధికారంలో ఉండటంతో ఆయన వేదన అరణ్య రోదనే అయ్యింది. కొత్తగా ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడటంతో రఘురామ అప్పట్లో తనపై జరిగిన కస్టోడియల్‌ టార్చర్, హత్యాయత్నం ఘటనలపై గుంటూరు పోలీసులకు గత నెలలో ఫిర్యాదు చేశారు. హత్యకు యత్నించిన వారితో పాటు అందుకు ప్రోత్సహించిన వారిని, ఘటనను కప్పిపుచ్చేందుకు యత్నించిన వారిని కూడా బాధ్యులుగా చేయాలని కోరారు. తీవ్ర రక్తగాయాలయ్యేలా చితక్కొట్టినా వైద్య పరీక్షల తర్వాత అప్పటి జీజీహెచ్‌ సూపరింటెండెంట ప్రభావతి ‘రిమాండ్‌కు ఫిట్‌’ అనేలా తప్పుడు నివేదిక ఇచ్చారని రఘురామ ఆరోపించారు. సీఐడీ అధికారుల ఒత్తిళ్లకు తలొగ్గి ఆమె తప్పుడు నివేదిక ఇచ్చారని, అందుకే ఆమెనూ ఈ కేసులో బాధ్యురాలిగా చేయాలని ఫిర్యాదులో పేర్కొనడంతో ప్రభావతిని ఐదో నిందితురాలిగా చూపారు. నగరంపాలెం సీఐ మధుసూదనరావు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే రఘురామకృష్ణరాజు ఆరోజు తనపై దాడికి పాల్పడిన సీఐడీ అధికారులతోపాటు మరికొందరి ఫోన్‌ డేటా భద్రపరచాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

వైద్యుల తప్పుడు నివేదిక
సీఐడీ అధికారులు తనను రాత్రంతా తీవ్రంగా కొట్టారని, దారుణంగా హింసించారని పేర్కొంటూ రఘురామ అప్పట్లో న్యాయమూర్తి ఎదుట తన గాయాలు చూపించి వాంగ్మూలమిచ్చారు. ఆయన అరికాళ్లపై కమిలిన గాయాలు అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. ఆయన్ను రమేష్‌ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించాలని న్యాయమూర్తి ఆదేశించగా, పోలీసులు గుంటూరు జీజీహెచ్‌లో పరీక్షలు చేయించారు. జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌గా ఉన్న ప్రభావతి ఆయనకు గాయాలు లేవని నివేదిక ఇవ్వడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు సికింద్రాబాద్‌లోని మిలిటరీ ఆసుపత్రిలో మళ్లీ వైద్య పరీక్షలు చేయగా, ఆయనకు గాయాలైనట్లు నివేదిక వచ్చింది.

నిందితులు వీరే..

ఏ1: పీవీ సునీల్‌కుమార్, సీఐడీ విభాగం మాజీ అధిపతి
ఏ2: పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, నిఘా విభాగం మాజీ అధిపతి
ఏ3. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, నాటి ముఖ్యమంత్రి
ఏ4. ఆరన్‌ విజయ్‌పాల్, అదనపు ఎస్పీ, సీఐడీ
ఏ5. డాక్టర్‌ ప్రభావతి (నాటి గుంటూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌), ఇతరులు